nazriya looks : నజ్రియా అనేది ఒక పేరు కాదు .. అదొక అందమైన మాత్ర అంటారు కుర్రాళ్లు. నజ్రియా అనే పేరు వినగానే వెండితెరపై వెన్నెల కురిపించే అందమైన చందమామ గుర్తుకు వస్తుంది. సమ్మోహితులను చేసే నవ్వు గుర్తుకు వస్తుంది. విశాలమైన కళ్లతో చేసే విన్యాసాలు గుర్తుకు వస్తాయి. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి .. ఆ తరువాత హీరోయిన్స్ గా క్రేజ్ ను సంపాదించుకున్న అతి తక్కువ మందిలో నజ్రియా ఒకరుగా కనిపిస్తుంది. మలయాళ .. తమిళ భాషల్లోని కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన ఆమె గ్లామర్ కళ్లముందు కదలాడుతుంది.
వెండితెరపై నజ్రియాను చూసినవాళ్లు ఇలాంటి పిల్లను ఇంతవరకూ చూడలేదనే చెప్పారు. ఆమె అభిమానులుగా ఉండిపోవడమే అదృష్టమన్నారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న నజ్రియా, వరుసబెట్టి చాలా సినిమాలు చేయవచ్చు. కానీ కెరియర్ మాంఛి జోరుమీద ఉన్న సమయంలో వివాహం చేసుకుని, ఓ నాలుగేళ్ల పాటు నటనకి దూరంగా ఉంది. అంతకుముందు .. రీ ఎంట్రీ తరువాత కూడా ఆమె ఆశించినస్థాయి సినిమాలు చేయలేదు. నిర్మాతలు పారితోషికం విషయంలో వెనకడుగు వేయకపోయినా, ఆమె అంతగా ఉత్సాహం చూపించింది లేదు.
అలాంటి నజ్రియా ‘అంటే .. సుందరానికీ’ సినిమాతో నానీ జోడీగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని మరీ ఆమె డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాలో ఆమె లీలా థామస్ పాత్రలో కనిపించనుందంటూ లుక్ ను రివీల్ చేశారు. నజ్రియాకి యూత్ లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదుగానీ .. ఆమెలో మునుపటి గ్లామర్ లేదు. చందమామకి పాల బుగ్గలు తగిలించినట్టుగా ఉండే నజ్రియా, కాస్త సన్నబడి అంత ఆకర్షణీయంగా అనిపించడం లేదు. మరి ఈ సినిమా చూసినవాళ్లు లుక్ పరంగా ఆమెకి ఎన్ని మార్కులు ఇస్తారనేది చూడాలి.
Also Read : ‘అంటే సుందరానికి’ లో నజ్రియా ఫహద్ లుక్ రిలీజ్