Keerthy: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆతర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించి మెప్పించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత మహానటి సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్ర పోషించే అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించడం కాదు.. జీవించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది.
అయితే.. మహానటి సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటించింది కానీ.. కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. పెంగ్విన్ అనే సినిమాలో కీర్తి సురేష్ ఓ బిడ్డకు తల్లిగా నటించింది కానీ.. ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా సక్సెస్ కాలేదు. అయితే.. మళ్లీ ఇప్పుడు ఓ బిడ్డకు తల్లిగా నటించేందుకు ఓకే చెప్పిందని సమాచారం. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.
ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కీర్తి సురేష్ నటించనుందని.. ఇందులో వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉంటుందని సమాచారం. పాత్ర నచ్చడంతో కీర్తి సురేష్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. మరి.. ఈ సినిమాతో శర్వానంద్, కీర్తి సురేష్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.