చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందంటే అది విశాఖ ఓటర్ల భిక్షేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలు ఓట్లు వేయడం వల్లే ఇక్కడ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారని, విశాఖ ఓట్లు కావాలి, సీట్లు కావాలి కానీ విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆ పార్టీ నేతలు దోచుకున్న విలువైన భూములను మా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే.. భూములు దోచుకుంటున్నారని మాట్లాడడం సరికాదన్నారు. తాను గానీ, ఎంపి విజయసాయిరెడ్డి గానీ ఒక్క గజం భూమి ఆక్రమించినట్టు నిరూపించగలిగితే, దేనికైనా సిద్ధమని అవంతి సవాల్ విసిరారు.
వందల కోట్ల రూపాయల భూ కబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారని, పల్లా ఆక్రమణలు వెలుగు చూసినందున ఇప్పుడు ఆయనపై పార్టీ పార్టీ వైఖరే ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు జూమ్ మీటింగ్‌లు పెట్టి మేడిపండు సామెతలా.. తామేదో నీతివంతులం అన్నట్లుగా నీతులు చెబుతుంటారని, చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా పల్లా శ్రీనివాసరావుని తక్షణం విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడి పదవి తప్పించాలని డిమాండ్ చేశారు.
విశాఖ సిటీలోనే లక్షా 80 వేల మంది పేదలు ఇళ్ళ పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్నారని, పేదలకు ఇళ్ళు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, రాష్ట్రమంతా ఇళ్ళ పట్టాలిస్తే ఇక్కడ మాత్రం కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు.
ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న దోషులు ఎంత పెద్ద వారైనా సరే కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని అవంతి గుర్తు చేశారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని మా ప్రభుత్వం భావిస్తోందని, ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని కోరారు.