ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం 60.4 పాయింట్స్ సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ రంగం పట్ల ఉన్న విజన్, ముందు చూపు, పని తీరుకు నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతోందని వినోద్ కుమార్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అగమ్యగోచరంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా.. తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భావం తర్వాత విద్యుత్ రంగ స్వరూపాన్ని సమూలంగా మెరుగు పర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేసి ఎద్దేవా చేశారని.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని పటాపంచలు చేసి విద్యుత్ రంగాన్ని అత్భుతంగా తీర్చిదిద్దారని, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తున్నారని వినోద్ కుమార్ వివరించారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కన్నా, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఎంతో మెరుగైన స్థానంలో ఉందని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2014-15లో విద్యుత్ ఉత్పత్తి 9,470 మెగావాట్స్ ఉండగా, 2020-21 లో 17,218 మెగా వాట్స్ కు పెరిగిందని ఆయన తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వల్ల తెలంగాణ రాష్ట్రంలో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషంగా ఉన్నారని, స్వరాష్ట్రం తెలంగాణ వల్లనే ఇది సాధ్యమైందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Also Read : గుజరాత్‌లో పవర్‌హాలిడే – మంత్రి కేటీఆర్ ఎద్దేవా