NASIN: నూతనంగా ఏర్పడిన జిల్లాలో పాలసముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న నాసిన్ కేంద్రం రాయలసీమ ప్రాంతానికే తలమానికం కానుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. శుక్రవారం నాసిన్ అకాడమీ నిర్మాణ పనులను బుగ్గన పర్యవేక్షించారు. మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ బుగ్గన వెంట ఉన్నారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ పాలసముద్రంలో నెలకొల్పే నాసిన్ సంస్థ భారతదేశ చరిత్ర పటంలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.
ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రం, హైదరాబాద్ లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోలీసు శిక్షణా కేంద్రాల తరహాలోనే నాసిన్ లో ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీసు) ఉద్యోగులు, కస్టమ్స్ ఉద్యోగులు శిక్షణ పొందబోతున్నారన్నారని తెలిపారు. నాసిన్ కేంద్రం భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉద్యోగులకు శిక్షణ అందించనుందని వివరించారు. శ్రీ సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కి ఇచ్చే శిక్షణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించడంలో నాసిన్ లాంటి అకాడమీలు చురుకైన పాత్ర పోషిస్తాయని వివరించారు.
నాసిన్ ప్రాధాన్యత గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెనకబడిన రాయలసీమ ప్రాంతంలోనే సంస్థ నెలకొల్పేందుకు సహకరించడంతో పాటుగా సంస్థ ప్రారంభోత్సవానికి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాసిన్ వీలైనంత త్వరగా నిర్మాణ పూర్తి అయ్యేందుకు, జిల్లా అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగిందన్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి పలు చర్యలు చేపడతానని తెలిపారు.
Also Read : భక్తులకు మరికొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదం