విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుతో తెలుగుదేశం పార్టీ నేతల బండారం బట్టబయలైందని మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, 5 నెలల్లో 430 ఎకరాలను వెనక్కు తీసుకున్నామని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న భూమి మార్కెట్ విలువ 2,600 కోట్ల రూపాయలని, బహిరంగ మార్కెట్ లో అయితే అది 4,776 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుంచి విముక్తి చేయడం తప్పా అని మంత్రి ప్రశ్నించారు. భూ ఆక్రమణలు అడ్డుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపు యజ్ఞానికి ప్రతిపక్షాలు మద్దతు పలకాలని అవంతి సూచించారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని, ఎంతటివారైనా జగన్ విడిచిపెట్టారని అవంతి వివరించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చేరిపివేయవద్దని మంత్రి అవంతి విపక్షాలకు సూచించారు.