Hyderabad Girl Bags Rs 2 Crores Job At Microsoft :
ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తమ కలలు నిజం కావాలని కోరుకుంటారు. వాటిని సార్థకం చేసుకునేవారు తక్కువ. పట్టుదల, అందుకు తగ్గ ప్రతిభ ఉంటే సాధించలేనిది ఏమీ లేదు.
తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉద్యోగాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది మన హైదరాబాదీ అమ్మాయి. అసలే కరోనా కాలం. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి. అయినా సరే అమెరికాలో అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. అదేంటి అమెరికాలో ఉద్యోగం సాధిస్తే గొప్పేంటి ? ప్రత్యేకంగా చెప్పుకోవటం ఏంటి? ఐటి కోర్స్ చేసిన ప్రతి ఒక్కరూ అమెరికా పోయి ఉద్యోగం చేయాలనుకోవడం పరిపాటే, మామూలేగా అనుకుంటే పొరపాటే.
అక్కడే ఉంది ట్విస్ట్. తన టాలెంట్ ను నిరూపించుకొని కళ్ళు చెదిరే ఆఫర్ కొట్టేసి వార్తల్లోకి వచ్చింది ఈ అమ్మాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో అక్షరాల రెండు కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించింది ఈ హైదరాబాదీ. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వార్తల్లోకెక్కింది. సాధించాలనే పట్టుదల ఉంటే ఏ కల అయినా నెరవేరక తప్పదని నిరూపించింది.
పేరు దీప్తి. హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థిని. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో క్లూస్ టీం నిపుణుడిగా, ఆ టీంకు హెడ్ గా పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న కుమార్తె ఈమె. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటి , ? హైదరాబాద్ కే గుర్తింపు తెచ్చింది. అంతేకాదు తెలుగుజాతి గౌరవం పెంచింది.
Police officer Dr. Venkanna, Clues team, Hyderabad Police, Deepti’s father
Deepthi Narkuti : Hyderabad Girl Bags Rs 2 Crores Job At Microsoft :
చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ వచ్చిన దీప్తి బీటెక్ పూర్తయిన తర్వాత ప్రముఖ సంస్థ జేపీ మోర్గాన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఛాన్స్ కొట్టేసింది. ఉన్న ఉద్యోగంతో తృప్తి పడక మూడేళ్ళ తరువాత 2019లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. యూనివర్సిటీ అఫ్ ఫ్లోరిడా లో ఎంఎస్ (కంప్యూటర్స్) లో చేరి, ఈ ఏడు మేలో ఆ కోర్సు పూర్తి చేసింది.
అయితే కోర్సు పూర్తికాకముందే యూనివర్సిటీ క్యాంపస్ ఇంటర్వ్యూలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది దీప్తి. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆమె చూపిన ప్రతిభను గుర్తించి మైక్రోసాఫ్ట్ తో పాటు గోల్డ్ మన్ సాక్స్, అమెజాన్ వంటి మేటి సంస్థలు ఆమెకు ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. భారీగా వేతనాన్ని ఇవ్వజూపాయి. మైక్రోసాఫ్ట్ సంస్థను ఎంచుకున్న దీప్తి ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి మొగ్గు చూపారు.
Anjani Kumar, Hyderabad Police Commissioner Congratulates Deepti (Daughter of Police officer Dr. Venkanna)
దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తమ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ (ఎస్ డి ఈ) గ్రేడ్ -2 కేటగిరీకి ఎంపిక చేస్తూ రెండు కోట్ల వార్షిక ప్యాకేజీ ప్రకటించారు. క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన మూడు వందల మంది లో అత్యధిక ప్యాకేజీ పొందిన దీప్తి వార్తల్లోకెక్కారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని గత నెల 17వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అయింది. కొత్త జీవితం ఆరంభించింది.
ఉద్యోగం దొరికితే చాలు అనుకునే వారే ఎక్కువ. అలాంటిది మంచి ఉద్యోగం దొరికినా, దానితో తృప్తి పడకుండా ఉన్నత చదువులపై దృష్టి పెట్టి తన ప్రతిభకు తగ్గ ఉద్యోగాన్ని సాధించాలన్న తపనను నెరవేర్చుకుంది దీప్తి. చిన్నతనం నుంచి చదువులో రాణిస్తూ వచ్చిన దీప్తి తన తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో తన కెరీర్ కు మార్గదర్శకం చేసుకుంది.
సార్థక నామధేయురాలిగా దీప్తి ….తన జీవితంలో వెలుగులు నింపుకుంటూనే, కుటుంబానికి వెలుగులు పంచింది. తగిన గుర్తింపు పొందుతూ, తన జన్మభూమికి కీర్తిని తెచ్చిపెట్టింది. దీప్తికి పర్యాయపదం ప్రతిభ, అదే వెలుగు …సాఫ్ట్వేర్ ప్రపంచంలో తన ప్రతిభతో అందరికీ అందని వార్షిక ప్యాకేజీ సొంత చేసుకున్న మన దీప్తి ఎందరో యువతీ యువకులకు ఆదర్శం కావాలి.
తన రంగంలో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.
-వెలది కృష్ణ కుమార్
Must Read : భర్త ఆశయ సాధనలో….