Sunday, June 28, 2026
HomeTrending Newsపెట్రో కారిడార్ కు కేంద్రం సుముఖం : గౌతమ్ రెడ్డి

పెట్రో కారిడార్ కు కేంద్రం సుముఖం : గౌతమ్ రెడ్డి

25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు స్థాపనకే కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే 50 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు.

దీనివల్ల రానున్న 2,3 ఏళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, ఈస్ట్ కోస్ట్ కారిడార్ లో 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని మేకపాటి విశ్వాసం వ్యక్తం చేశారు.

కేంద్ర పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మేకపాటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ బృందం సమావేశమయ్యారు.

ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించారని, దీనికి కొనసాగింపుగా ఇవాళ ఏపీలో పెట్రో కెమికల్ కారిడార్ గురించి కేంద్రమంత్రితో మరోసారి ప్రధానంగా చర్చించామని మేకపాటి తెలియజేశారు.

పెట్రోల్ లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి కేంద్ర పెంచిన దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. రిఫైనరీ సామర్థ్యం పెంచాలనుకోవడం, మొలాసిస్ ఉత్పత్తి ఎక్కువగా చక్కెర కర్మాగారాల ద్వారా వస్తోందని. దాని ద్వారా ఇథనాల్ గా మార్చడం కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు.

పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి కేంద్ర మంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చామని, వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయాలని ధర్మేంద్ర ప్రదాన్ నిర్దేశించారని చెప్పారు.

రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవడమే కాకుండా, మరో రూ.16వేల కోట్లు ఎస్ఐపీసీలో క్లియర్ అయ్యాయని, ఎస్ఐపీబీ అనంతరం వీటిపై కూడా పూర్తి స్పష్టత వస్తుందన్నారు. కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular