Sunday, November 10, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచేతులు మారనున్న ట్విట్టర్

చేతులు మారనున్న ట్విట్టర్

No ‘Free’dom:  కేవలం యాగరక్షణ కోసం కాకుండా, మిథిలకు తీసుకెళ్లి సీతమ్మతో పెళ్లి జరిపించడానికే విశ్వామిత్రుడు వచ్చాడని అవతార పురుషుడయిన పురుషోత్తముడికి తెలియకుండా ఎందుకుంటుంది?

తండ్రి దశరథుడు కోరుకున్నట్లు తనకు పట్టాభిషేకం జరగదని జగదానందకారకుడికి తెలియకుండా ఎందుకుంటుంది?
మహాభారత యుద్ధం జరిగి తీరుతుందని శ్రీకృష్ణుడికి తెలియకుండా ఎందుకుంటుంది?

అన్నీ తెలిసే ఉంటాయి. తెలియనట్లు ఉంటారంతే. అలా ఉండాలి కూడా. అవతార ధర్మమది.

ఆ యుగాల్లోనే కాదు, ఈ యుగంలో కూడా జరగబోయేది తెలిసిపోతూ ఉంటుంది. తెలియనట్లు ఉండాలంతే. లేదా తెలిసి ఒక నిట్టూర్పు విడవాలంతే.

వేల కోట్ల విలువయిన మైండ్ ట్రీ కంపెనీ వాటాను కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ ఎలా తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువకు ఎల్ అండ్ టీ కి అమ్ముకుని…వ్యాపార యాత్రతో పాటు దేహ యాత్రను కూడా చాలించాడో మొన్ననే ఐ ధాత్రి ప్రస్తావించింది. ఆ లింక్ ఇది:-

మైండ్ ట్రీ చెప్పే ఎల్ అండ్ టీ కాఫీ కథ

తెలుగు సినిమాలకు పాఠ్యపుస్తకం, నిఘంటువు అయిన మాయాబజార్లో మాటల మాంత్రికుడు పింగళి శ్రీకృష్ణుడితో చెప్పించిన మాట- “చిన్నచేపను పెద్ద చేప మింగుతుంది; ఆ పెద్ద చేపను తిమింగలం మింగుతుంది. అది మాయ; ఇది మాయ. అటు నేనే; ఇటు నేనే.”

ట్విట్టర్ కంటే ముందు సులభంగా అర్థం కావడానికి తెలుగు నేలలో జరిగిన కొన్నిటిని తవ్వుకుందాం. జెమినీ టీ వీ ని స్థాపించింది తెలుగు వ్యాపారులు. ఇప్పుడది తమిళ సన్ టీ వీ సొంతం. మా టీ వీ ని కని, పెంచి, పోషించింది మురళీకృష్ణం రాజు. తరువాత వచ్చిన భాగస్వాములు నిమ్మగడ్డ, నాగార్జున, చిరంజీవి తదితరులు. ఇప్పుడది స్టార్ టీ వి సొంతం. భారతీయ భాషలన్నిటిలో ఈ టీ వి ని శాఖోపశాఖలుగా విస్తరించింది రామోజీ రావు. ఇప్పుడు తెలుగు తప్ప మిగతా ఈ టీ వి లు ముఖేష్ అంబానీ సొంతం. బాంబే కొత్త విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టి, లాభాలతో నడుపున్నది జి వి కె రెడ్డి. ఇప్పుడది అదానీ సొంతం. ఇలా తెలుగువారు ఇరవై, ముప్పయ్ ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న ఎన్నో ఓడరేవులు, పవర్ ప్రాజెక్టులు, ఇతరేతర కంపెనీలు ఇప్పుడెవరి చేతుల్లో ఉన్నాయో రాస్తే ఆ లిస్ట్ కొండవీటి చేంతాడు కంటే పెద్దది అవుతుంది. కారణాలు అనేకం. కొన్నిటిని విధిలేక అమ్ముకున్నారు. కొన్నిటిని బలవంతంగా లాక్కున్నారు. కొన్నిటిని పరస్పర అంగీకారంతో అమ్ముకున్నారు. కొన్నిటిని భయంతో అమ్ముకున్నారు. బయట ప్రపంచానికి చెప్పుకోలేని మరికొన్ని కారణాలతో కొందరు అమ్ముకున్నారు.

ఇప్పుడు ట్విట్టర్  దగ్గరికి వెళదాం. దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు ట్విట్టర్ ను గంపగుత్తగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొంటున్నాడు. ఇకపై అది ప్రయివేట్ లిమిటెడ్ అంటే మస్క్ సొంత కంపెనీ. ఒకే ఒక యజమాని. భాగస్వాములు, పెట్టుబడిదారులు అందరూ మాయమైపోతారు. అవ్వాలి కూడా.

ఎలాన్ కొన్నది మరో కార్ల కంపెనీనో, ఇంకొకటో అయితే ఇంత చర్చ అనవసరం. అభిప్రాయ వ్యక్తీకరణకు సరిహద్దుల్లేని ఒక విశ్వ వేదిక ట్విట్టర్ ను కొన్నాడు. ట్విట్టర్ నిర్వహణ సరిగ్గా లేదని కొనకముందే ప్రకటించాడు. ఇకపై ట్విట్టర్ ఏకైక యజమానిగా ఆయన ఎలా చెబితే అలాగే ఉంటుంది.

Twitter

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను, ప్రజాభిప్రాయాలను శాసించగలిగే స్థాయికి సామాజిక మాధ్యమాలు ఎదిగాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ లు ఎలా అభిప్రాయాలను కూడగడుతున్నాయో? ఉన్న అభిప్రాయాలను మారుస్తున్నాయో? రెచ్చగొడుతున్నాయో? మనకు మనంగా వాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి ఎలా వెళ్లిపోయామో? లైకులు, షేర్లు, ఫార్వార్డ్ లు, కామెంట్లు, డి పి లుగా మనల్ను మనం ఎలా మార్చుకున్నామో? చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటివేళ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్ వేదిక మీద ఎలాన్ మస్క్ ఎంతవరకు కాపాడతాడు అన్నది ఒక ప్రశ్న. అసలు ట్విట్టర్ వ్యవహారమే ఇకపై ఎలా ఉంటుందో తెలియడం లేదని సాక్షాత్తు దాని ప్రస్తుత అధిపతి నిట్టూరుస్తున్నాడు. ట్విట్టర్ అధిపతి నైరాశ్యంలో ఎన్నెన్నో ప్రశ్నలున్నాయి. అవి ట్విట్టర్ లో పట్టేంత పొట్టి అక్షరాల సందేశాలు కావు…ట్విట్టర్ లో పట్టనంత పెద్ద పెద్ద సందేహాలు.

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి :

జయహో మస్క్

 

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్