To clear: ఉపాధి హామీపథకం బిల్లులకు సంబంధించి 1900 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సిఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. చెత్త తరలింపునకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ప్రతి ఇంటికీ తడి, పొడి చేత్తకు రెండు డస్ట్ బిన్ లు అందిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అతి త్వరలో 1073 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీపథకం, గ్రామీణ రహదారులు, తాగునీటిపై సిఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ముత్యాల నాయుడు వివరాలను మీడియాకు వివరించారు.
సమీక్ష సందర్భంగా… వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు సిఎంకు వివరించారు. జూలై వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, తాగునీటి కోసం తీసుకున్న శాశ్వత చర్యల వల్ల గతంలో పోల్చుకుంటే వేసవి నీటి ఎద్దడిని గణనీయంగా తగ్గించగలిగామని సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెలైనిటీ ప్రభావం, ఉద్దానంలో ప్లోరైడ్ ప్రభావం, వైయస్సార్ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వారు వివరించారు.
సిఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు…
- చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలి
- కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలి.
- ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి
- గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయి.
- అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించాం.
- భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
- భవన నిర్మాణ పనులు ఆగకూడదు… అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఉపాధి హామీ పనులుకు సంబంధించి… బిల్లులు అప్‌లోడ్ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదు
- ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి.
- అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి.
- గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలి
- వైయస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్,
- లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై కూడా సిఎం సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతి ప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : మెడికల్ కాలేజీలు మంజూరు చేయండి: సిఎం