Something happen: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు నంద్యాల వచ్చిన పవన్ పొత్తులు, రాజకీయ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పొత్తులు, ప్రజా ఉద్యమం అంటూ ఇటీవల చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై కూడా పవన్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నేరుగా పొత్తుల ప్రస్తావన తీసుకు వస్తే అప్పుడు మాట్లాడతానని వెల్లడించారు.
2014లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేశామని, ఎలాంటి పొత్తులు అయినా ప్రజలకు ఉపయోగ పడేలా ఉండాలన్నదే తన అభిమతమని, వ్యక్తిగతంగా తన ఎదుగుదల గురించి ఏనాడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించలేనప్పుడు పొత్తులోనుంచి బైటకు వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి లాభాపేక్ష తనకు అవసరం లేదన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని తాను చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ నేటి పాలకుల తీరే కారణమన్నారు. ఎవరినీ బతకనివ్వడం లేదని, అందరి ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలబడడం లేదని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, జాబ్ క్యాలండర్ ఇవ్వకుండా నిరుద్యోగం పెంచుతున్నారని, చాలా మంది నిరుద్యోగులకు వయో పరిమితి దాటిపోయిందని, పరిశ్రమలు రావడం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని…. ఇలా ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.