You Can’t: చంద్రబాబు నాయుడు బంగారు నాణేలు పంచిపెట్టినా వచ్చేఎన్నికల్లో కుప్పంలో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర విద్యుత్, గనులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. 35 ఏళ్ళ తర్వాత ఇప్పటికైనా చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నారని, అంతకుముందు ఆయనకు ఇక్కడ కనీసం అడ్రస్ కూడా లేదని, ఆర్ అండ్ బి బిల్డింగే అతని అడ్రస్ గా ఉండేదని మండిపడ్డారు. తిరుపతి, మారుతి నగర్ లోని తన కార్యాలయంలో శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
చెన్నై సంస్థ గుప్పిట్లో ఇసుక.. అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తపై పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇసుకా లేక ఈనాడుకు మసకా? అని ప్రశ్నించారు. బాబు హయాంలో 3,750 కోట్ల రూపాయల ఇసుక ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని, టీడీపీ హయాంలో బాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడి జరిగినా ఈనాడు రామోజీకి కనిపించలేదా? అని ఫైర్ అయ్యారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, పారదర్శకమైన ఇసుక విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులతో కమిటీ వేసి, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నూతన ఇసుక విధానం తీసుకువచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వేలం నిర్వహించినది ఏపీ ప్రభుత్వం కాదని, దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ ఎండీసీ(నేషనల్ మినరల్ డెవలప్ మెంటు కార్పొరేషన్) ద్వారా వేలం వేయించామని, రూ. 120 కోట్లు డిపాజిట్ చేసిన ఎవరైనా టెండర్ వేయవచ్చని చెప్పమని వివరించారు. “దీనిలో ఈనాడు రామోజీరావు పాల్గొనవచ్చు. చంద్రబాబు కూడా పాల్గొనవచ్చు. లేదా వారి బినామీలతో టెండర్లు వేయించి ఉండవచ్చు. ఆ రోజు వారెందుకు టెండర్లు వేయలేదన్నదానికి కూడా వారే సమాధానం చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఆఫీసులు ఉండి, ఢిల్లీ కేంద్రంగా ప్రధాన ఆపీసు ఉన్న జేపీ సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది” అని వెల్లడించారు.
ఇసుక తవ్వకాల్లోగానీ, రవాణాలోగానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు బ్యూరోను మా ప్రభుత్వం తీసుకొచ్చిందని, అక్రమాలు జరిగితే.. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 14500 ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు రిజిస్టర్ చేస్తున్నామని, ఇప్పటికే వేల కేసులు నమోదు చేయడంతో పాటు, 1400 వాహనాలను సీజ్ చేశామని పెద్దిరెడ్డి చెప్పారు.
విద్యుత్ మీటర్లు ఉరితాళ్ళు అంటూ మాట్లాడుతున్న చంద్రబాబు కుప్పం రైతులకు ఏం తాళ్ళు బిగించాడని, కేవలం రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి ఉంటే హంద్రీ-నీవా నీళ్ళు కుప్పంకు వచ్చి ఉండేవని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, కుప్పం నుంచి ఏడుసార్లు గెలిచి కుప్పంకు ఏం చేశారాని బాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అసమర్థుడు కాబట్టే… కుప్పం నియోజకవర్గానికి కూడా ఏ ఒక్క మేలూ చేయలేకపోయారని, వ్యవసాయం దండగ అని మాట్లాడిన వ్యక్తి, రైతుల మీద కనీసం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రైతుల మీద ఎటువంటి భారం పడకుండా, మీటర్లు పెడుతుంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయన ప్రశ్నించారు.