ప్రతిపక్ష నేతగా ఉండడానికి చంద్రబాబు అనర్హుడని వైఎస్సార్ సిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనాకు భయపడి రాష్ట్రానికి రాకుండా వేరే రాష్ట్రంలో తలదాచుకోవడం దుర్మార్గమని అన్నారు.
ఎవరైనా మంచి చేస్తుంటే చంద్రబాబుకు నచ్చదని, వారిపై బురద జల్లుతారని ఆరోపించారు. తానూ మంచి చేయడు, ఇతరులు చేస్తుంటే సహించలేకపోవడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ప్రభుత్వంపై అయన చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాసవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని అయన వ్యతిరేకిస్తూనే ఉంటారని, చంద్రబాబులో అణువణువు నెగెటివ్ క్యారెక్టర్ తోనే కూడుకుని ఉందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, భవిష్యత్తులో కూడా ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యిందని, మరో 25 ఏళ్ళపాటు ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండారని విజయసాయి ధీమాగా వెల్లడించారు.
మన్సాస్ ట్రస్ట్ విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళతామని, కోర్టు తీర్పు తర్వాత అశోక్ గజపతి రాజు చెలరేగిపోతున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. అయన ఛైర్మన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అశోక్ గజపతి వందల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. ఒక ఫోర్జరీ కేసులో కూడా ఆయనపై కేసు నమోదయ్యిందని, ఏ రోజైనా జైలుకు వెళ్ళక తప్పదని స్పష్టం చేశారు. మహిళలు ట్రస్ట్ చైర్మన్ గా ఉండకూడదంటూ మన్సాస్ ట్రస్ట్ నియమావళిలో రాసుకున్నారని, ఇది సుప్రీం కోర్ట్ లో చెల్లదని విజయసాయి అన్నారు.