ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నారా లోకేష్ తాట తీస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తే తాము అంతకంటే ఎక్కువగానే తిడతామని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజాబలం, నిగ్రహం, మంచితనం ముందు మీలాంటి సన్నాసులు దేనికీ పనికిరారని లోకేష్ ను ఉద్దేశించి తీవ్రంగా దుయ్యబట్టారు. అతిగా మాట్లాడితే నీ చరిత్ర, నీ అయ్య చరిత్ర బైటపెడతామని నాని తీవ్రంగా స్పందించారు. గ్రామ స్థాయిలో జరిగిన హత్యలను ముఖ్యమంత్రికి ఆపాదించడం తగదని, ఇలాగే మాట్లాడితే మా పార్టీ కార్యకర్తలే దేహశుద్ధి చేస్తారని నాని హెచ్చరించారు.
రైతు సమస్యలపై చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదమని నాని అన్నారు. ప్రజల్లో పభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు అయన చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు. ధాన్యం కొన్న తరువాత 21 రోజుల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకూ 1,637 వేల కోట్ల రూపాయలు చెల్లించామని నాని చెప్పారు. ఇంకా 1,619 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయలు అడ్వాన్సు ఇవ్వాల్సి ఉందని, ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా ఈ విషయాన్ని కేంద్ర మంత్రుల వద్ద సిఎం జగన్ ప్రస్తావించారని నాని తెలియజేశారు. కేంద్రం ఇచ్చేదాకా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామని, కనీసం కేంద్రానికి ఈ విషయమై లేఖ రాసే దమ్ము కూడా చంద్రబాబుకు లేదని నాని విమర్శించారు.
చంద్రబాబు తన పరిపాలనలో చివరి మూడేళ్ళలో ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లించలేదని, సుమారు 4 వేల కోట్ల రూపాయలను జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన మూడు నెలల్లోనే విడుదల చేశారని నాని వెల్లడించారు.