రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 19 నుంచి 25 వరకూ పరీక్షలు జరుగుతాయి. ఆగస్ట్ 18 వరకూ అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు.
విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ విద్యార్దులు, టీచర్లు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఈ-సెట్, పిజి-సెట్, ఐ-సెట్, లా-సెట్, ఎడ్యుకేషన్-సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండు వారాల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తామని మంత్రి సురేష్ వివరించారు.
కోవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో జూలై 6 నుంచి 20 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు, జూలై 26 నుంచి ఆగష్టు 2 వరకూ పది పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ ప్రతిపాదనలు చేసింది, అయితే పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్ట్ నోటీసులు ఇచ్చిన దృష్ట్యా ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేశారు.