Social Justice Yatra: బలహీనవర్గాలు పాలకులుగా కాకుండా పాలితులుగా ఉండాలన్నదే సిఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం కల్పించి సామాజిక న్యాయం అమలు చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని అన్నారు. మూడేళ్ళ పాలనలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి ఇప్పటివరకూ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు పదవులు కల్పించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని, దీన్ని దృష్టిలో పెట్టుకొనే మంత్రివర్గంలో 74 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు కేటాయించారని, నామినేటెడ్ పదవుల్లో 50శాతం పైగా బీసీ వర్గాలకు అవకాశం కల్పించారని వివరించారు. ప్రభుత్వం ఆధ్వయంలో సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పారంభం సందర్భంగా శ్రీకాకుళంలో సహచర మంత్రులతో కలిసి ధర్మాన మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా సంక్రమించాయని, కానీ బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో, నామినేటెడ్ పదవుల్లో, మంత్రి వర్గంలో పదవులు ఇచ్చి సిఎం జగన్ ఈ వర్గాలను గౌరవించారని ధర్మాన వెల్లడించారు, ఈ స్థాయిలో పదవులు కల్పించిన విషయాన్ని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో బీసీలకు అందుతున్న ప్రయోజనాలను కూలంకషంగా వివరించేందుకే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ యాత్రలో నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, సంక్షేమం, సామాజిక న్యాయంపై పజలకు తెలియజేస్తామన్నారు. మంత్రివర్గంలో 74 శాతం ఈ వర్గాలకే అందాయన్నారు.
ఇప్పటిదాకా బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే తెలుగుదేశం పార్టీ వాడుకుండని, వారికి అవకాశాలు కల్పించలేదని ధర్మాన అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా చంద్రబాబు రాష్ట్రమంతటా తిరిగినా ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పలేకపోయారని ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగుతోందని, అభివృద్ధి, పాలనలో మార్పులు ప్రజలు గమనిస్తున్నాని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు,