Saturday, November 23, 2024
HomeTrending Newsతెలుగురాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు: సుబ్బా రెడ్డి

తెలుగురాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు: సుబ్బా రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో 500 శ్రీవారి దేవాలయాలు కొత్తగా నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 16 టిటిడి కళ్యాణ మండపాలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల కొండపై అనుమతి లేని షాపులను మూడు రోజుల్లో తొలగిస్తామని స్పష్టం చేశారు. సుబ్బా రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం అన్నమయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు, అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంజనేయుడి జన్మ స్థలం అంజనాద్రి అని తాము నమ్ముతున్నామని, అయితే దీనిపై ఎలాంటి వివాదాలు వద్దని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

18 నెలల్లో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని, అక్కడి ప్రభుత్వం 62 ఎకరాల భూమి కేటాయించిందని…. తర్వాత ముంబై, వారణాసిల్లో కూడా శ్రీవారి అలయాలు నిర్మిస్తామని వివరించారు. తమ పాలకమండలి ‘గుడికో గోమాత’ పేరుతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందని, దీన్ని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. సహజ వనరులతో పండించిన పంటలతోనే స్వామి వారికి నైవేద్యం తయారు చేసున్నామని, దీన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సేంద్రీయ, సహజ వ్యవసాయంపై రైతులతో చర్చిస్తున్నామని  తెలియజేశారు.

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో పెద్దపీట వేశామని సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని విజయవంతంగా అమలు చేయగలిగామన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఎస్వీబీసి ఛానల్ ను త్వరలో కన్నడ, హిందీ భాషల్లోనూ మొదలు పెడతామని సుబ్బారెడ్డి ప్రకటించారు.

వై వి సుబ్బారెడ్డి  ఛైర్మన్ గా ఉన్న ప్రస్తుత పాలక మండలి పదవీకాలం రెండ్రోజుల్లో అనగా జూన్ 21 తో ముగుస్తోంది, ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం ఇది. 85 అంశాలను నేటి సమావేశంలో బోర్డు ఆమోదించింది.  ఛైర్మన్ గా సుబ్బారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించే యోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలిసింది. దీనిపై సోమవారం లోగా నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్