Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపునర్జన్మ ఖర్మ

పునర్జన్మ ఖర్మ

belief: హిందూ సనాతన ధర్మ మౌలిక సూత్రాల్లో పునర్జన్మ ఒకటి. “పెట్టి పుట్టడం” అన్న మాటను అలవోకగా వాడేస్తుంటాం. అందులో పెట్టి అంటే గత జన్మలో దాన ధర్మాలు చేయడం వల్ల ఈ జన్మలో సుఖంగా ఉన్నామని అర్థం. ఒప్పుకోలు. అంటే ఈ జన్మలో దురదృష్టానికి గత జన్మలో దాన ధర్మాలు చేయకపోవడమే కారణం. అలాగే ఈ జన్మలో ఇంకా ఇంకా పెడితే…వచ్చే జన్మల్లో ఇంకా ఇంకా అదృష్టంతో పుడతాం అని సూచన. ఎంత పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఎవరికి పెట్టాలి? అన్నదానికి కూడా ధర్మ శాస్త్రం చాలా స్పష్టంగా లెక్కలు చెప్పింది. అవన్నీ ఇక్కడ అనవసరం.

జన్మ రాహిత్యమే మోక్షం. అది అంత సులభంగా అందరికీ సాధ్యం కాదు. కాబట్టి పులిగా, పిల్లిగా, బల్లిగా, నల్లిగా ఏదో ఒక ప్రాణిగా ఏదో ఒక రూపంలో సామాన్యులమయిన మనం పుడుతూనే ఉంటాం అని పునర్జన్మ సిద్ధాంతం చెబుతుంది.

“ఎవ్వరెవ్వ రి వాడొ  ఈ జీవుడు?
చూడ నెవ్వరికి నేమవునో  ఈ జీవుడు?

ఎందరికి కొడుకుగాడీజీవుడు?
వెనక కెందరికి తోబుట్టడీజీవుడు?
ఎందరిని భ్రమ యించ డీజీవుడు?
దుఃఖ మెందరికి గావింప డీజీవుడు ?

Woman Live With Snake

ఎక్కడెక్కడ తిరుగడీజీవుడు?
వెనుక కెక్కడో  తన జన్మ మీజీవుడు?
ఎక్కడి చుట్టము తనకు ఈ జీవుడు?
ఎప్పుడె క్కడికి నేగునో ఈ జీవుడు?

ఎన్నడును చేటులేనీజీవుడు?
వెనుక కెన్ని తనువులు మోవడీ జీవుడు?”

అని అన్నమయ్య చెప్పిన విషయం కూడా ఇదే. ఈ జీవుడు గతంలో ఎన్ని శరీరాల్లో ఎన్ని కోట్ల సార్లు పుట్టాడో? భవిష్యత్తులో ఇంకెన్ని కోట్ల జన్మలున్నాయో? ఆ బ్రహ్మకే తెలియాలి.

“ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా?”

మనింట్లో ఈగ, దోమ, బల్లి, నల్లి వెనుక జన్మలో మన బంధువులేనేమో? ఏమో? ఎన్ని శాస్త్రాలు ఎంత తాత్వికంగా ఇలాంటి విషయాలను విడమరిచి చెప్పినా మనకు అర్థం కావు. ఇంటి హాల్లోకి ఏ పామో, తేలో వచ్చిందుకోండి. వెంటనే కర్ర తీసుకుని కొట్టి చంపుతాం. చెప్పుకింద తేలును నలిపేస్తాం. ఆ పాముతో మన బంధుత్వాన్ని అన్వేషించం. గత జన్మలో ఆ పాము మన కుటుంబ సభ్యుల్లో ఎవరని మానవ భాషలో మాట్లాడం. పాముకు పాలు పోసినా అది విషపు కోరలతో కాటేస్తుందన్న జ్ఞానం ముందు గత జన్మల జ్ఞానం తర్కానికి నిలబడదు.

అయితే…ఇది సామాన్య దృష్టి. అసామాన్య దృష్టి ఉన్నవారికి పడగ విప్పిన పాము తలపై స్పష్టంగా గత జన్మ ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐ డి కనిపిస్తాయి. అలా కర్ణాటకలో ఒకామె భర్త చనిపోయిన కొన్ని రోజులకే ఇంటికి బుసలు కొడుతూ వచ్చిన తాచు పాములో భర్త స్పష్టంగా కనిపించాడు. చనిపోయిన భర్త తన మీద అవ్యాజమయిన ప్రేమతో పాము జన్మ ఎత్తినా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడని ఆమె మురిసిపోయి…భర్తకు…సారీ…పాముకు మర్యాదలు చేసింది. “పక్కలో పామును పడుకోబెట్టుకున్నట్లు” అన్న సామెతను ధిక్కరించి పక్కమీద పామునే పడుకోబెట్టుకుంది. విషయం తెలిసిన ఊరిజనం పక్కలు తడిశాయి. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ఆమె భర్త పామును అడవిలో వదిలారు.

Woman Live With Snake

మనిషిగా బతికి ఉండగా ఆ భర్త ఈ భార్యను ఎంత బాగా చూసుకున్నాడో? చనిపోయి విషపు కోరల పాముగా వచ్చినా…పాము భర్తను భరించడానికి సిద్ధపడింది. లేక భర్తను భరించి…భరించి…పామును భరించడం సులభం అయ్యిందా? అలవాటు అయ్యిందా?

ష్…!
గట్టిగా మాట్లాడకండి.
భర్త పాముగా వస్తున్నాడు.
భార్య ముంగీసగా వస్తోంది.
భర్త పాము బాధపడతాడు!
భార్య ముంగీస బాధపడుతుంది!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సోఫా సహిత సర్పం

RELATED ARTICLES

Most Popular

న్యూస్