Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసోఫా సహిత సర్పం

సోఫా సహిత సర్పం

Snakes – Omens:
ఏరి కోరి మెత్తటి పరుపు  కొని, షో రూమ్ నుండి ఇంటికి తెచ్చుకుని, హాల్లో వేసుకుని కూర్చుంటే…అనుకున్నదానికంటే మరీ మెత్తగా ఉంది. ఇంతటి సౌఖ్యానికి కారణమయిన ఆ సోఫాను ఒకసారి చేత్తో తనివి తీరా తాకి చూద్దామని చేయి పెడితే…ఆ మెత్తదనాన్ని ఇచ్చినది సోఫాలో చుట్టలు చుట్టుకున్న పెద్ద పాము అని తెలిసి ఆ ఆసామి హతాశుడయ్యాడు. బాగున్నావా? హాయిగా ఉందా? అన్నట్లు ఆ సర్పరాజం బుస్ బుస్ అని తన భాషలో మాట్లాడేసరికి ఈయనకు పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే ఎగిరి దూకి ఇంటి బయటపడి పోలీసులకు ఫోన్ చేశాడు. వారొచ్చి సోఫాలో సుఖాసీనుడై ఉన్న ఆ సర్పరాజు గారిని పట్టుకుని వన్యప్రాణి సంరక్షణ విభాగానికి అప్పగించారు. వారు ఆ పామును భద్రంగా అడవుల్లో వదిలిపెట్టారు. అమెరికాలో జరిగింది ఈ సోఫా సహిత సర్ప గృహప్రవేశం.

దాదాపుగా ఇలాంటి అనుభవమే నాకొకటి ఉంది. పైసా పైసా కూడగట్టుకుని, జీవిత పర్యంతం తిరిగి చెల్లించేలా బ్యాంక్ లోన్ తీసుకుని ఒక అపార్ట్ మెంట్ కొన్నాను. అపార్ట్ మెంట్ ధరతో సమానంగా ఇంటీరియర్ చేయించుకోవడం ఆధునిక ధర్మం. అలా ఒక ఇంటీరియర్ డిజైనర్ కు పని అప్పగించాను. ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ ప్రాంత వడ్రంగి పనివాళ్లను అతను పనిలో పెట్టుకున్నాడు. ఆరు నెలలుగా నత్తకు నడకలు నేర్పుతూ పని మందగమనంతో సాగుతూ ఉంది. ఒక సాయంత్రం వడ్రంగి ఫోన్ చేశాడు. ఘర్ మే ఏక్ బడా సాంప్ ఆయా, కమరే మే హై, ఆప్ తురంత్ ఆయియే…అని. నేను, మా ఆవిడ భయ భక్తులతో వెంటనే వెళ్లాము. ఈలోపు స్నేక్ సొసైటీ వారికి ఫోన్ చేశాము. రూములో ప్లయ్ వుడ్ పలక తీయబోతే కింద హాయిగా పవళించి ఉంది. వెంటనే రూము తలుపు వేసి బయటికి వచ్చాను. చెక్కలు కదిలించేసరికి కిటికీ ఊచల మీద ఇలా పడగవిప్పి చిద్విలాసంగా ఉంది అని సెల్ ఫోన్ తో తీసిన వీడియో కూడా చూపించాడు. నాగుపాము. ఐదడుగుల పైన ఉంది.

ఈలోపు బిల్డర్ ఆఫీసు వాళ్లు వచ్చి…గొడవ చేయకండి సార్…ఇంకా అమ్ముడుపోవాల్సిన ఇళ్లున్నాయి…చిన్న పాము…భయపడకండి…అని వారి సిగ్గులేని మార్కెటింగ్ మెళకువలను…అలాంటి వేళ కూడా ప్రదర్శించడం నాకు తెగ నచ్చింది. కార్పెంటర్ తీసిన వీడియో చూపగానే భయపడి వాళ్లు జారుకున్నారు. స్నేక్ సొసైటీ అబ్బాయి వచ్చాడు. ఎంత వెతికినా ఆ పాము కనపడలేదు. వచ్చినదారినే వెళ్లిపోయి ఉంటుందిలెండి అని ఓదార్చి వెళ్లిపోయాడు. ఇంటి ఫాల్స్ సీలింగుల్లో ఎక్కడన్నా పిల్లా పాపలతో ఆ నాగరాజు గారు ఇంకా ఉన్నారేమో తెలియదు. మూడేళ్లలో అలికిడి అయితే లేదు.

శాస్త్రం ఆగిపోయిన చోట నమ్మకాలు మొదలు కావాలి. అనేక ఆధ్యాత్మిక వ్యాఖ్యాన గ్రంథాలు రాసిన మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పా. పామును చంపలేదు కదా? అన్నది ఆయన మొదటి ప్రశ్న. చంపలేదు…దొరకలేదు…అన్నాను. ఏ వైపు గదిలో వచ్చింది? అన్నది తరువాత ప్రశ్న. ఉత్తరం వైపు అని చెప్పా. ఏ పాము? మూడో ప్రశ్న. నాగుపాము సమాధానం.

అంతే… నా భయాన్ని చిటికెలో తీసేశారు మా నాన్న. ఒరేయ్! ఉత్తర ద్వారంలో నాగుపాము…చాలా శుభ సూచకం. నిధి నిక్షేపాలను రక్షించేందుకు, ఇవ్వడానికి వచ్చిందిరా…పైగా మన ఇంటి దేవుడు మొదట సుబ్రహ్మణ్యస్వామి. తాత దత్తత వెళ్లడంతో ఇంటిదేవుడు పెంచలకోన నరసింహస్వామి అయ్యాడు. అందుకే నా పేరు సుబ్బయ్య. చిన్నాన్న పేరు సుబ్బనరసయ్య అని పెట్టారు…అని చారిత్రక ఆధారాలతో నాకు జ్ఞానం కలిగించారు. దాంతో ఆ పాము రావడంలో నా పూర్వ జన్మల పుణ్య విశేష ఫలం ఉందన్న ఎరుక కలిగి…భయం పోయి భక్తి కలిగింది. గృహ ప్రవేశంలో సుబ్రహ్మణ్య హోమం చేద్దామని మా నాన్నే సూచించారు. అలాగే చేశాను. ఎందుకయినా మంచిదని ఇంటి నిండా నెమలి బొమ్మలు కూడా పెట్టుకున్నా. సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల ఆ పాము ఈ నెమలి పరస్పర వైరభావం వదిలి సుహృద్భావంతో నన్ను చల్లగా చూస్తున్నాయి.

ఈ ముప్పయ్ ఏళ్లలో జర్నలిజంలో, వ్యాపారంలో నాకెదురయిన కాలనాగులు, విష సర్పాలతో పోలిస్తే ఇంటి ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన ఈ నాగరాజు పరమ సాత్వికుడు. శ్రేయోభిలాషి. ఆప్తుడే అయి ఉండాలి. మనిషికి నిలువెల్లా విషమే. అలాంటి మనిషి రూపంలో ఉన్న మూడు, నాలుగు సర్పాలు అదను చూసి పడగ విప్పి…కాటు వేస్తే…కోలుకోవడానికి నాకు నాలుగయిదేళ్లు పట్టింది. ఈ నరరూప సర్పాల నుండి నన్ను రక్షించడానికి అసలు సర్పమే కదిలి వచ్చిందని కార్యకారణ సంబంధాలతో పోల్చుకుంటూ ఉంటాను.

అంతా అయిపోయాక పేరుమోసిన ఆ బిల్డర్ తారసపడ్డాడు. ఏమయినా పాము వచ్చాక మీ దశ తిరిగినట్లు ఉందే? అన్న అర్థం ధ్వనించేలా మాట్లాడాడు. సర్పాగమనంతో నా మహర్దశ సంగతేమో కానీ…పాము రావడాన్ని కప్పి పుచ్చిన మీ మేనేజ్మెంట్ విద్య మాత్రం సర్పయాగం కన్నా గొప్పది అని మొహమాటం లేకుండా చెప్పాను.

ఏ పుట్టలో ఏ పాముందో? ఎవరికెరుక?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : గేదె తంతోంది… అరెస్ట్ చేయండి సార్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్