Different film: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా నటించిన నరేశ్ వి.కె. మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
“ఈ ఎరాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లలనుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అ..ఆ., భలే భలే మగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాదర్ గా నిలిచాయి. అంటే సుందరానికీ` సినిమాలో నానికీ నాకు మంచి ర్యాపో వుంది. నాని కామెడీ టైమింగ్ చాలా స్పార్క్‌గా వుంటుంది. సెకన్‌లో క్యాచ్ చేసేస్తాడు. నేను ఆ స్కూల్ నుంచి వచ్చినవాడిని కనుక నాకు తెలుసు. నేను ఇందులో చేసిన ఫాదర్ పాత్ర `ది బెస్ట్` అని చెప్పగలను. దానికి రెండు కారణాలున్నాయి.
మొదటిది దర్శకుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మధ్య కామెడీ టైమింగ్. ఎమోషన్ ను క్యారీ చేస్తూ ఆడియన్స్‌ను నవ్వించే పాత్ర. కీలకమైన పాత్ర ఇది. నానితో ఫాదర్ గా, దేవదాసులో బ్రదర్ గా చేశాను. మళ్ళీ ఫాదర్ గా చేశాను. మా ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎమోషన్స్ కూడినవి. మేమిద్దరం నటిస్తుంటే సెట్లో అందరూ లీనమైపోయి ఓన్ చేసుకున్నారు. అలాగే రోహిణి పాత్ర కూడా. తను మంచి నటి. ఈ సినిమా తర్వాత నెక్ట్స్ లెవల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సివుంటుంది. నానికి చాలా కాలం తర్వాత హ్యూమర్ జోనర్ పడడం అదృష్టం.
ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్ అయి తెలుగులో విజయపతాకాన్ని ఎగురవేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో కుటుంబకథా చిత్రాలు తగ్గాయి. మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబకథాచిత్రాలకు ఆణిముత్యంలాంటి సంస్థ అని చెప్పొచ్చు. మెమొరబుల్ హిట్ అవుతుంది. మైత్రీనుంచి పుష్ప, సర్కారువారి పాట ఇలా వరస విజయాల్లో ఈ సినిమా మరోటి అవుతుంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు, నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు. వారు మిత భాషీయులు. వారు ఎంచుకునే కథలు హైలట్ అవుతాయి. అవే వారి విజయానికి నిదర్శనం. నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా. నా కెరీర్ ను తర్వాత స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది.
కామెడీ సినిమాలు గతంలో జంథ్యాల, వంశీ, రేలంగి నరసింహారావు చిత్రాలు వచ్చాయి. ఇవాళ నేటి ఆడియన్స్ పల్స్ బట్టి సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమాకు రచయిత, దర్శకుడు ఒక్కరే. దానివల్ల మంచి సినిమాలు వచ్చేవి. దర్శకుడు, రచయిత వేరు వేరు అయితే సరిగ్గా తీయడం కష్టం. మరలా ఇప్పుడు పాత రోజులు మాదిరే రచయిత, దర్శకుడు ఒక్కరే అయ్యేలా యంగ్ దర్శకులు రావడం ఆనందంగా వుంది. అయితే కామెడీ సినిమాలు రాయడం కష్టం. తీయడం మరీ కష్టం. నటీనటులు కుదరడం మరింత కష్టం. ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులున్నారు. వారంతా టైమింగ్ వున్న వారే. నా మదర్ గా భిక్షు గారి భార్య నటించింది. తను బాగా నటించింది. ఏది ఏమైనా ఒక సినిమా హిట్ అయితే వరసగా కొద్దికాలం అవే వస్తుంటాయి. మారుతీ దర్శకత్వం లో ప్రేమకథా చిత్రం వచ్చాక హారర్ కామెడీ వరుసగా వచ్చాయి.
నేను సెకండ్ ఇన్నింగ్స్‌లో రావడానికి ఎస్.వి. రంగారావును స్పూర్తిగా తీసుకున్నాను. ఆయన మెప్పించని పాత్ర లేదు. అలా నన్ను నేను సెట్ చేసుకోవడానికి పదేళ్ళు పట్టింది. తెలుగులో మంచి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న సినిమాలకు రెమ్యునరేషన్ చూడకుండా మంచి పాత్ర అనిపిస్తే చేస్తున్నాను. నేను సినీ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నిర్మాత సాధక బాధలు తెలుసు. నేను లీడ్ రోల్స్‌గా రెండు సినిమాలు చేస్తున్నాను. 38 ఏళ్ళ పాత్ర కూడా చేస్తున్నాను.
Also Read : ‘అంటే సుందరానికీ’ ట్రైలర్ విడుదల