Interaction: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మోదాపల్లి ప్రాంతంలో గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వారి వ్యవసాయ విధానాలపై అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వాల నుంచి అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తమ ప్రధాన వృత్తిగా ఉన్న వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు కేంద్రమంత్రికి వివరించారు.
కాఫీ పంట సాగుకి ప్రోత్సాహకాలను అందించాలని రైతులు కోరగా ప్రస్తుతం ప్రభుత్వం నుండి ఎలాంటి సదుపాయాలూ అందుతున్నాయో, ఇంకా ఏమి కావాలన్న దానిపై జిల్లా కలెక్టర్, ITDA అధికారులతో చర్చించారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించ్చాల్సిందిగా అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
అంతకుముందు విశాఖ జిల్లా వేపగుంట నందు ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించారు. గిరిజన విద్యార్థులకు సివిల్స్ పరీక్షలకొరకు అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలపై కేంద్రమంత్రి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖ్యముఖి నిర్వహించి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై వాకబు చేశారు. వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఆయా జిల్లాల అధికారులు , సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
Also Read : బాధ్యతగా మాట్లాడాలి : జై శంకర్