Fake news: వారసత్వం అనేది తండ్రి, తాత నుంచి వస్తుందని పిల్లనిచ్చిన మామ నుంచి రాదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మామను చంపి పార్టీని లాక్కోవడం వారసత్వం కాదన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో కొడాలి పాల్గొన్నారు. తెలుగుదేశం మహానాడు అనేది ఒకప్పుడు చరిత్ర అని.. ఈసారి రాష్ట్ర స్థాయి మహానాడు తర్వాత జిల్లా స్థాయి మహానాడులు నిర్వహిస్తున్నారని, ఈ తీరు చూస్తుంటే పెద్ద దినం అయిన తరువాత చిన్న దినం పెట్టుకున్నట్లుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో చిట్టి మహానాడు కూడా నిర్వహిస్తారేమో అని సందేహం వ్యక్తం చేశారు.
అనంతరం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై నాని నిప్పులు చెరిగారు. మద్యంపై తెలుగుదేశం, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని, ఆఖరికి అరబిందో ఫార్మా తయారు చేసే మందుల్లో కూడా విషం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యంలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలు ఉంటాయని, ప్రతి మద్యం బాటిల్ మీదా ప్రాణ హాని హెచ్చరిక ఉంటుందని, ఈ విషయాన్ని వారు కొత్తగా చెప్పేది ఏమిటని ప్రశ్నించారు.
ఏదైనా ఒక అంశం మీద పేపర్లో ‘విశ్వసనీయ వర్గాల భోగట్టా’ అంటూ ఎల్లో మీడియాలో ఓ వార్త రాస్తారని, దాన్ని పట్టుకొని రోజంతా టిడిపి నేతలు ప్రెస్ మీట్ లతో ఊదరగొడతారని విమర్శించారు. అరబిందో ఫార్మా ఏళ్ళ తరబడి మందులు తయారు చేస్తోందని, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు తమ ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేస్తుందని, ఎక్కడైనా పొరపాటు ఉంటే, అంతర్జాతీయ న్యాయస్థానాలకు లాగుతారని …. అలాంటి కంపెనీపై అర్ధంలేని ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో హయ్యస్ట్ టాక్స్ పేయర్ అరబిందో అని, అలాంటి వారు జగన్ బినామీలు ఎలా అవుతారని సూటిగా ప్రశ్నించారు.
బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పెట్టుకున్న కంపెనీ హెరిటేజ్ అని నాని వ్యాఖ్యానించారు. హెరిటేజ్ పాలల్లో విష పదార్ధాలు ఉన్నాయని.. ఈ పాలను కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నిషేధం కూడా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read : మీకు భయపడేది లేదు: కొడాలి నాని