‘మా’ అధ్యక్ష బరిలో తానూ ఉన్నానంటూ ముందుకొచ్చారు నటి హేమ. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. యువహీరో మంచు విష్ణు.. సీనియర్ నటీమణి జీవిత రాజశేఖర్ పోటీబరిలో నిలవగా.. ఇప్పుడు నాలుగో అభ్యర్ధిగా హేమ కూడా బరిలో నిలుస్తున్నారు. తన వారి కోసం పోటీకి దిగుతున్నానని హేమ వ్యాఖ్యానించారు.
కొన్నేళ్లుగా `మా` ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టాను ..పదవులకు న్యాయం చేశాను. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నా…. కానీ ప్రకాష్ రాజ్ గారు .. మంచు విష్ణు బాబు.. జీవిత గారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దలంతా ఎలక్షన్ బరిలో దిగుతున్నారని తెలిసాక.. అసలు పోటీ చేయొద్దనే అనుకున్నాను. అందుకే పోటీకి దూరమని నిన్న ప్రకటించా’ అని హేమ అన్నారు.
సినీప్రముఖులంతా ఫోన్ చేసి “నువ్వెందుకు పోటీ చేయకూడదు.. నువ్వుంటే బావుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు.. అందుకే నువ్వు కావాలి అని అడుగుతున్నారు. నేను పోటీ చేయనని చెప్పినా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికోసం…. నా వారి కోసం ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను..“ అని తెలిపారు.