Nothing to find: పెగాసస్ స్పై వేర్ ను గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొన్నారా లేదా అనే విషయాన్ని హౌస్ కమిటీ స్పష్టం చేయాలని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. పెగాసస్ మీద తేల్చకుండా వ్యక్తుల డేటా చౌర్యం జరిగిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని వ్యాఖ్యానించారు. డేటా చోరీ విషయంలో ఇప్పటికే కేసు నడుస్తోందని, ఈ విషయంలో అసలు సభా సంఘం చేయడానికి ఏముందని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, ప్రభుత్వం గతంలో తమపై చేసిన ఆరోపణన విషయంలో నవ్వుల పాలయిందని ఎద్దేవా చేశారు.
పెగాసస్ పై అసలు సభా సంఘాన్నే ఏకపక్షంగా నియమించారని, దానిలో టిడిపి సభ్యులు ఎవరినీ నియమించలేదని కేశవ్ విమర్శించారు. ఇది ప్రభుత్వ కమిటీ కాదని, అసెంబ్లీ కమిటీ అని, దానిలో టిడిపి నుంచి రాజీనామా చేసి వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న సభ్యుడిని నియమించారని గుర్తు చేశారు.
చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనలేదని ఈ విషయమై గత డిజిపి స్వయంగా వివరణ ఇచ్చారని పయ్యావుల గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై సైబర్ నిఘా పెటిందని, ఇంటలిజెన్స్ తో పాటు, ప్రైవేటు వ్యక్తులను ఉపయోగించుకొని నేతల ఫోన్లలో మాల్ వేర్ పంపించి నిఘా పెట్టారని ఆరోపించారు. ఇది నిజం కాకపొతే ఈ విషయంలో కేంద్ర సంస్థలతో ఆడిట్ చేయించాగాలరా అని ప్రశ్నించారు. ఎవరిపైనా అయినా నిఘా పెట్టాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధి విధానాలు ఇచ్చిందని, దాన్ని పాటించకుండా, కనీసం ఆ సమాచారం హోం సెక్రటరీ, లా సెక్రటరీల వద్ద కూడా లేకుండా నిఘా పెడుతున్నారని కేశవ్ విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలమీదే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరకు సాక్షి ఉద్యోగుల మీద కూడా నిఘా పెట్టి వారి ఫోన్ అక్రమంగా ట్యాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. నిఘా భయంతోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన లాప్ టాప్ లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాడడం లేదని కేశవ్ అన్నారు.
Also Read : డేటా చౌర్యం జరిగింది: భూమన వెల్లడి