Kakatiya Heritage: కాకతీయ వైభవ సప్తాహం వరంగల్లులో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్న కాకతీయ వంశం 22 వ వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ కు భద్రకాళి దేవాలయం వద్ద రాష్ట్ర మంత్రులు శ్రీనివాస గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి ఘనంగా స్వాగతం పలికారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన తో, భారీ ర్యాలీగా భద్రకాళి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
నేడు ఆరంభమైన ఈ ఉత్సవాలు 13వ తేదీ వరకూ జరగనున్నాయి, రామప్ప దేవాలయం వద్ద పేరిణి నృత్య ప్రదర్శనతో ఉత్సవాలు ముగుస్తాయి. వేడుకలో అతిథిగా పాల్గొంటున్న భంజ్ దేవ్ హైదరాబాద్ చేరుకొని స్టేట్ గ్యాలరీలో 777ఫోటోలు, 777 నాణేలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభిస్తారు.
ఉత్సవాలను ప్రారంభించిన అనంతరం నేతలంతా అతిథితో కలిసి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
వరంగల్ లోని పోచమ్మ మైదానం లో గల రాణి రుద్రమదేవి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.