రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు వికారాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. రెవెన్యు, పోలీసు యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మహబూబాబాద్ లో భారీ వర్షాలు… మత్తిడి పోస్తున్నచెరువులు
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు మత్తడి పోస్తున్నాయి. వర్షాల కారణంగా బయ్యారం పెద్ద చెరువు తులారం ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. బయ్యారం గుట్టమీద పాండవుల జలపాతం, చింతొని గుంపులోని వంక వాగు జలపాతాలు జాలువారుతున్నాయి. దీంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయ్యారం, తిమ్మాపురం గ్రామాల మధ్య వట్టేవాగు… గార్ల, రాంపురం గ్రామాల మధ్య పాకాల ఏరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల కేంద్రంలో నిన్నటి నుండి భారీ వర్షంతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్ళే రోడ్డు వరదతో నిండిపోయింది.
భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ(GHMC) హై అలర్ట్(high alert) ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరుగా కురిసిన వర్షం రాత్రి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక నగరంలో శనివారం కూడా వర్షం భారీగా పడుతోంది. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి హై అలర్ట్ ప్రకటించింది. శనివారం ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ నేపథ్యంలో రసూల్ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఇంటి నుంచి ఆఫీసులు వెళ్లే ఉద్యోగులు వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు. కార్లలో వెళ్లిన వారు గంటల తరబడి ప్రయాణించిన పరిస్థితి నెలకొంది. మరో మూడు, నాలుగు రోజులపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.