భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే ఎలా చెబుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ రాబోయే కాలంలో ఏపీ టిడిపిలో ఏక్ నాథ్ షిండే అంటూ విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అన్నట్లు వచ్చిన వార్తలపై వీర్రాజు స్పందించారు. అవి చెప్పి చేసేవి కావన్నారు. విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే టిఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోలవరం అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని సోము ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తాజా వివాదం నడుస్తోందని, ఇలా చేస్తే ప్రజలు వారిని ఇంటికి పంపేరోజు త్వరలోనే వస్తుందని ఆయన హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టును నాడు టిడిపి, నేడు వైసీపీ ఏటీఎంలాగా ఉపయోగించుకుంటున్నాయని, ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, నాటి చంద్రబాబు ప్రభుత్వం 56వేల కోట్ల రూపాయలకు అంచనాలు వేస్తే తప్పుబట్టిన జగన్ ఇప్పుడు అదే అంచనాల ప్రకారం నిధులు ఇవ్వాలని ఎలా అడుగుతారని సోము ప్రశ్నించారు. పోలవరాన్ని కేంద్రం తప్పకుండా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు.
విలీన మండలాల్లో ఐదు గ్రామాల ప్రజలు తాము తెలంగాణాలో కలుస్తామని తీర్మానాలు చేస్తున్నారని, వారికి భద్రాచలంపై ఆధారపడి ఉండడం వల్లే వారు అటువైపు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముంపు మండలాల్లో గ్రామాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృషి చేయాలని, పోలవరం నిర్వాసితులకు సరైన సహాయ పునరావాసం కల్పించాలని సోము డిమాండ్ చేశారు. విలీన గ్రామాల్లో సిపిఎం ఉద్యమాలు చేసి ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారమే పోలవరం నిర్మాణం మొదలయ్యిందని, పోలవరాన్ని ఏదైనా సాకుతో ప్రశ్నించడం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించడమేనని, విభజన చట్టాన్ని తిరగతోడడమేనని వీర్రాజు అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ నేతలు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, భద్రాచలం ఒకప్పుడు తూర్పు తూర్పు గోదావరిలోనే ఉండేదని, 1960 ప్రాంతాల్లో వాటిని భద్రాచలంలో కలిపారని గుర్తు చేశారు. విభజన సమయంలో భద్రాచలంతో పాటు, రెండు మండలాలూ తెలంగాణాకు ఇచ్చారని, దీనివల్ల దుమ్ముగూడెం టేల్ పాండ్ కూడా ఏపీ వదులుకోవాల్సి వచ్చిందని వివరించారు.
Also Read : అనవసర వివాదాలు వద్దు: రాంబాబు సూచన