కరోనాతో కన్నుమూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి. యాక్షన్ టీంలకూ ఇన్‌ఛార్జిగా ఉన్నారని సమాచారం. రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికితోడు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండటంతో పార్టీ నాయకత్వం అతడి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల అంచనా.
రాష్ట్ర పార్టీలో కూడా దామోదర్ సీనియర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఏటూరు నాగారం-భూపాలపల్లి ఏరియా, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌కు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న రాష్ట్ర పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఇప్పటివరకు హరిభూషణ్ కార్యదర్శిగా పనిచేశారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్, అదే జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.