భద్రాచలంలో తాము 20 ఏళ్ళ క్రితం ముందు చూపుతో కరకట్ట నిర్మాణం చేశామని, దానివల్లే ఎంతటి వరదలు వచ్చినా ఈ పట్టణ ప్రజలు ఆందోళన లేకుండా గడపగలుగుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవలి గోదావరి వరద పీడిత ప్రాంతాల బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబు నిన్న, నేడు పోలవరం విలీన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం అయన భద్రాచలం సీతారామస్వామిని దర్శించుకునారు. అనంతరం గోదావరి కరకట్టను పరిశీలించారు, తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం చేసే ఒక పని భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలోచించాలని దానికి నిదర్శనమే ఈ కరకట్ట అని పేర్కొన్నారు.
భద్రాచలం కరకట్ట మాదిరిగానే ఐదు ముంపు గ్రామాలకు కూడా కరకట్ట నిర్మించి శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని, దీనికోసం తమ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. 86లో వచ్చిన గోదావరి వరదలకు భద్రాచలం మునిగిపోయిందని, నాడు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇక్కడ పర్యటించానని బాబు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే కరకట్ట నిర్మించాలన్న ఆలోచన తనకు వచ్చిందన్నారు. శ్రీరాముడి ఆదేశాలతోనే ఇది జరిగిందని తాను అనుకుంటున్నానని, అందుకే ఇటీవలి వరదల సమయంలో ప్రజలు హాయిగా నిద్ర పోగాలిగారని, ఇది తనకు సంతోషం కలిగించిన అంశమని వెల్లడించారు.