మరియమ్మ మృతి దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి ఎం. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని వెల్లడించారు. లాకప్ డెత్ కు గురైన మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ ను ఖమ్మం సంకల్ప ఆసుపత్రిలో డిజిపి పరామర్శించారు. అడ్డగూడురులో ఏం జరిగిందనే విషయమై విషయమై అయన ఆరా తీశారు.
జరిగిన సంఘటనపై ఉదయ్ కిరణ్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు డిజిపి. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు అత్యంత క్రూరంగా కొట్టారని డిజిపికి వివరించారు. ‘నా చేతిలోనే అమ్మ చనిపోయింది సార్’ అంటూ బావురుమన్నారు. న్యాయం చేయాలని వేడుకున్నాడు.
మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ ఘటనతో సంబంధం ఉన్న పోలీసు లను ఇప్పటికే సస్పెండ్ చేశామని, విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని ఉదయ్ కిరణ్ కి డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు. సుమారు 30నిమిషాల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు.