స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని… ఈ తరుణంలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ తెలంగాణలో పరుగులు పెడుతున్న అభివృద్ధికి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జెడ్పీ మైదానం నుంచి ప్రారంభం అయిన ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించి జాతీయ జెండాను చేతబట్టి పట్టణవాసులంతా వెంట రాగా డైట్ కళాశాల మైదానం వరకు రన్ లో పాల్గొన్నారు. మంత్రితో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పుర ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డైట్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు… ఎందరో మహనీయుల త్యాగఫలంగా ఏర్పడిన మన దేశంలో అదే స్ఫూర్తితో ఏర్పడిన కొత్త రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో పరుగులు పెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాల పట్టికలో దేశంలోనే రెండో స్థానంలో ఉండడం మన రాష్ట్రంలో సాధించిన అభివృద్ధికి నిదర్శనం తెలిపారు. క్రీడా శాఖ మంత్రిగా ఈ ఘనత తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒకప్పుడు దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత, 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి, కరెంటు లేక భూములు ఎండిపోయే దుస్థితి, ఉపాధి లేక వలసలు వెళ్లే దారుణమైన స్థితి నుంచి నేడు ప్రతి రోజూ మిషన్ భగీరథ శుద్ధ జలం, 24 గంటల విద్యుత్తు, వ్యవసాయానికి రైతుబంధు పంట పెట్టుబడి, అన్నదాతకు అండగా ఉండేందుకు రైతు బీమా సహా అనేక పథకాలతో దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. దేశంలోనే వెనుకబడిన జిల్లా గా ఉన్న మహబూబ్ నగర్ నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చందడం ఎంతో సంతోషకరమైన విషయంగా మంత్రి పేర్కొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం ఎంతో సంతోషించదగ్గ విషయంగా మంత్రి పేర్కొన్నారు. ఇంతటి అభివృద్ధి సాధ్యమైనా ఇంకా కులమాతాలు, అసమానతలు అభివృద్ధికి విరోధకాలుగా మారాయని.. ఆకలిచావులు, అసమానతలు పోవాలని, కులం మతం కాదు అభివృద్ధి కావాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి అంటే నినాదాలు కాదని… మనుషులంతా ఒక్కటే అనే భావన రావాలన్నారు. ఉపాధి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, వలసలు పోయి… స్థానికంగానే ఉపాధి లభించాలన్నారు. త్యాగాల ఫలితంగా వచ్చిన దేశంలో అంతా ఐక్యమత్యంగా ముందుకు పోవాలన్నారు.
ఈ పరుగులో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : మహనీయుల త్యాగఫలం స్వాతంత్య్రం : మంత్రి తలసాని