భూముల రీసర్వే కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణ దాస్ విజ్ఞప్తి చేశారు. భూ తగాదాలకు ఈ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వంద సంవత్సరాల తర్వాత గ్రామాలు, పట్టణాల్లో వ్యవసాయ, గ్రామకంఠం, స్థిరాస్తుల రీసర్వే జరుగుతోందని, వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో ఈ సర్వే చేపడుతున్నామని చెప్పారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పథకం కింద జరుగుతున్న భూ సర్వే పైలట్ ప్రాజెక్టును హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి ధర్మాన ప్రారంభించారు. రెండు మండలాలకు హద్దుగా ఉన్న అగ్రహారంలో పొలాల మధ్య భూ హద్దు రాయిని పాతి సర్వే మొదలు పెట్టారు.
సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సర్వే నిర్వహిస్తున్నామని, దీనివల్ల భూ సమస్యలకు చెక్ పడుతుందని, రైతుల తగాదాలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. సర్వే తరువాత రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని, మూడేళ్ళ కాల వ్యవధిలో ఈ సర్వే పూర్తవుతుందని ధర్మాన వివరించారు.