రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్ లో యకోమా టైర్ల తయారీ కర్మాగారాన్ని సిఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి పరిశీలించారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన యకోమా టైర్ల తయారీ కర్మాగారం విశాఖకు రావడం వలన ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అమర్ నాథ్ అన్నారు. వ్యవసాయం, మైనిoగ్ తదితర రంగాల్లో ఉపయోగించే వాహనాలకు అనువైన టైర్లను ఇక్కడ తయారు చేస్తారని చెప్పారు. సుమారు 1500 కోట్ల రూపాయల వ్యయంతో 100 ఎకరాల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో 2000 మంది స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత భూమిని కేటాయించి, కర్మాగారాన్ని నిర్మించి, ప్రారంభోత్స వానికి సిద్దమైన తొలి పరిశ్రమ ఇదేనని అమర్నాథ్ వివరించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ కర్మాగారం నాంది పలుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమను త్వరలోనే మరో 1000 కోట్ల రూపాయలతో విస్తరిస్తారని అప్పుడు మరో 800 నుంచి వెయ్యి మందికి ఉద్యోగాలు లభించే అవకాశం వుందని చెప్పారు.