Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబి జె పి ఆపరేషన్ తమిళనాడు

బి జె పి ఆపరేషన్ తమిళనాడు

Rajini to Raj Bhawan! నటుడిగా రజనీకాంత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. మానవమాత్రులకు సాధ్యం కానిది ఏదయినా రజనీ సాధిస్తాడని ఆయన నటించిన పాత్రలవల్ల ఒకరకమయిన తమాషా పేరు స్థిరపడిపోయింది.

“God can walk on water. Rajni can swim through land!!!”
దేవుడు మహా అయితే నీళ్ళమీద నడవగలడు- అదే రజనీ అయితే భూమ్మీదే ఈదగలడు”

ఇలాంటి వేన వేల అసాధ్య, దుస్సాధ్య, రజనీ హీరోచిత జోకులు సామాజిక మాధ్యమాల నిండా నిర్విరామంగా వైరల్ గా తిరుగుతూనే ఉంటాయి. మరాఠీ అయి ఉండి కర్ణాటకలో పెరిగి, బస్ కండక్టర్ నుండి తమిళనాడు వెండితెరను శాసించే స్థాయికి ఎదిగిన రజనీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకమే. ఆయన వయసిప్పుడు డెబ్బయ్ దాటింది. చిన్నా పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కిడ్నీ మార్పించుకున్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళకండి అని డాక్టర్లు సలహా కూడా ఇచ్చారు. అయినా సరయిన సమయంలో తను రాజకీయాల్లోకి రావడం ఖాయం అని చెప్పి, కొన్ని యుగాల ఆలస్యంగా, ఎప్పుడు రాకూడదో అప్పుడు రాబోయి ఆగిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిలా రాజకీయ ప్రవేశాలకు వయోపరిమితి, కనీస విద్యార్హత, ఎంట్రన్స్ పరీక్షలు లేవు కాబట్టి ఆయన ఎప్పుడయినా రాజకీయాల్లోకి రావచ్చు. పోవచ్చు. అది పూర్తిగా ఆయనిష్టం.

ఇక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై అని రజనీకాంత్ స్పష్టంగా ప్రకటించాడు. సంతోషం. మంచి నిర్ణయం. తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయమే. నిండు నూరేళ్ల ప్రమాణం ప్రకారం రజనీ ఇప్పటికిప్పుడు తొందరపడాల్సిన పనిలేదు. ఇంకా ఆయన చేతిలో ముచ్చటగా ముప్పయి ఏళ్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఇంకో పది, పదిహేనేళ్ల తరువాత మళ్లీ రాజకీయ ప్రవేశ నిర్ణయం తీసుకున్నా పెద్ద నష్టమేమీ ఉండదు.

“సరయిన సమయంలో సరయిన నిర్ణయం. The right decision at the right time” అన్నది ఆదర్శం. బెంగళూరులో బస్ కండక్టర్ గా ఉన్నప్పుడు సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుని రజనీ ఒక చరిత్ర సృష్టించాడు. అలాంటివాడికి ఇప్పుడు రాజకీయ ప్రవేశానికి, వైదొలగడానికి ఏది సరయిన సమయమో ఇంకొకరు చెప్పాల్సినపనిలేదు.
డాక్టర్లు మనిషి అవయవాలను, వాటి పనితీరును, వైద్య పరీక్షల రిపోర్టులను చూసి వారి అనుభవంమేరకు ఏదో చెబుతుంటారు. బయట ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిని మిరాకిల్స్ అంటుంటారు. రజనీ మిరాకిల్స్ కే మింగుడుపడని మిరాకిల్ కాబట్టి- డాక్టర్ల భయంలో హేతుబద్దత లేదు.

“రజనీయే రాజకీయాల్లో అడుగుపెట్టిననాడు…
సాగరములన్నియు ఏకము కాకపోవు!
సముద్రాలన్నీ ఊళ్లళ్లోకి వస్తాయి.
ఊళ్లన్నీ సముద్రంలో మునుగుతాయి.
ఆకాశం నేలకు దిగుతుంది. నేల ఆకాశానికెక్కుతుంది!”
అని అనుకున్నారు. అద్భుతాలు చెప్పి జరగవు. జరిగినప్పుడే తెలుస్తుంది. సినిమాల్లో రజనీ అద్భుతం. రాజకీయాల్లో కాదు. నిండు నూరేళ్లు రజనీ సినిమా అద్భుతాలను చేస్తూనే ఉండాలని కోరుకుందాం.

(ఇక్కడిదాకా ఉన్న భాగం…ఇక రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు అని కొంతకాలం క్రితం రజనీకాంత్ ప్రకటించినప్పుడు ఐధాత్రి ప్రచురించినది)

ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం.
అలాంటి రాజకీయ వైరాగ్య జ్ఞానంతో అస్త్ర సన్యాసం చేసిన రజనీకాంత్ ను గవర్నర్ ను చేయబోతున్నారని తాజా వార్త. బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బి జె పి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక ఎత్తుగడ కావచ్చు. సాక్షాత్తు ప్రధాని మోడీ చెన్నైలో రజనీకాంత్ ఇంటికి వెళ్లడం కూడా అందులో భాగమే కావచ్చు.

దక్షిణాది తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో ఎలా ప్రవేశించాలో బి జె పి కి అర్థం కావడం లేదు. కర్ణాటకలో కమలం పప్పులు ఉడుకుతున్నాయి. ఎంతో కొంత తెలంగాణాలో చోటు దొరుకుతోంది.

కరుణానిధి, జయలిత లేని తమిళ గడ్డమీద తమకు చోటు దొరుకుతుంది అని మోడీ- అమిత్ షా అనుకుని శశికళకు పొగబెట్టారు. ఓ పన్నీరు! ఈ పన్నీరు! అంటూ ఇద్దరు పన్నీరుల కోసం ఎంతగా బి జె పి కన్నీరు కార్చినా కన్నీళ్లే మిగులుతున్నాయి కానీ…ఆ బురదలోనుండి కమలం మొగ్గ ఒక్కటయినా విచ్చుకోవడం లేదు.

దాంతో ఇళయరాజాకు రాజ్యసభ ఇచ్చారు. సంగీత దర్శకుడికి, కథ, మాటల రచయితకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పిండుకోవచ్చు అన్న వ్యూహం పొలిటికల్లీ కరెక్ట్ కావచ్చు. తమిళనాడు రాజకీయాలను మోడీ- అమిత్ షా తక్కువగా అంచనా వేసి…ఖంగు తిని…వ్యూహం మార్చుకున్నట్లున్నారు.  డిఎంకే స్టాలిన్ తో తూగగల ప్రతిపక్ష నేత ఇప్పటికయితే ఎవరూ కనిపించడం లేదు.

అలా అనుకుని తమిళనాడును పూర్తిగా వదిలేస్తే వారు మోడీ- షాలు ఎందుకవుతారు?
రజనీకాంత్ గవర్నర్ కావడం వల్ల ఆయన అభిమానులు సంతోషించవచ్చు.  ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఎక్కడో గవర్నర్ గా ఉన్న వ్యక్తి తమిళనాడులో బి జె పి కి ఊపిరి పోయగలడు అని అనుకోవడానికి మోడీ-అమిత్ షాలు ఏమీ అమాయకులు కాదు. ఇప్పుడు వారున్న స్థితిలో ఒకటి రెండు రాజ్యసభ స్థానాలు, ఒకటి రెండు గవర్నర్ పదవులు ఇవ్వడం వారికి పప్పు బెల్లాలు పంచడంతో సమానం. కొడుతూ ఉంటే ఏదో ఒకనాటికి బాక్సు బద్దలవుతుంది. ఇలాంటి ప్రతి చిన్న ప్రయత్నాన్ని, ప్రయోగాన్ని వదలకుండా చేస్తూ ఉంటే…మరో ఐదేళ్లకు…పదేళ్లకు… ముప్పయ్యేళ్ళకయినా  తమిళనాడులో బి జె పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

మోడీ- షా దీర్ఘకాల వ్యూహంలో పాటల ఇళయరాజా రాజ్యసభకు వెళతాడు. కథల విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడై ఆర్ ఎస్ ఎస్ మీద చిత్రాలకు కథలందిస్తాడు. బాబా రజనీకాంత్ గవర్నర్ అవుతాడు.

మోడీ- షా ఒక ఎత్తు వేశారంటే గుడ్డిగా ఉండదు. ఎత్తులు- పై ఎత్తులే రాజకీయం కాబట్టి గడ్కరీలు, శివరాజ్ సింగ్ చౌహన్ లతో పాటు మనం కూడా జరగబోయేది చూస్తూ ఉండాలంతే- మౌనంగా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

బిజెపి- టీఆర్ఎస్ వైరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్