ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లిక్కర్ సిండికేట్ తో ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఇంటి వద్ద నిన్న రాత్రి బిజెపి నేతలు నిరసనకు దిగటం తీవ్ర ఉద్రికతతకు దారి తీసింది. బిజెపి – తెరాస నేతల మధ్య వాగ్వాదం పెరిగి బాహాబాహీకి దారితీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను తెరాస నేతలు పరామర్శించారు.
టీఆర్ఎస్ పార్టీ నేతలను ముట్టుకుంటే మాడిపోతరు మా జోలికి వస్తే రోడ్ల మీద తిరగకుండా చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. నిన్న రాత్రి ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించి బీజేపీ నేతలు దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరిని ముట్టుకున్నా మాడిపోతారన్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులరా… ఇండ్లల్లో చెప్పి బయటకు రండని సత్యవతి రాథోడ్ నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ఆమె… కేసీఆర్ కి భయపడి అక్రమంగా కేసులు పెడుతూ వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ప్రజల దగ్గరికి వెళుతుందని చెప్పుకొచ్చారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ కవితను పరామర్శించి సంఘీభావం తెలిసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అన్నారు. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ ఇళ్ల మీదకి రావాలంటే పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా? అన్న మంత్రి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బిజెపి కార్యకర్తలను బంజార హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 29 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. అయితే అరెస్టులపై పోలీసులు స్పందించటం లేదు. వారిని విచారిస్తున్నామని అరెస్టు చేయలేదని చెపుతున్నారు. మరోవైపు బిజెపి కార్యకర్తలను విడుదల చేయాలని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కమలం శ్రేణులు నిరసనకు దిగాయి.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదు కవిత