గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పిల్ వే కింది భాగం కొట్టుకుపోవడంతో దాదాపు ఏడువేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోందని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్పిల్ వే లోని కింది భాగం కొట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. ప్రవాహం అధికంగా ఉండడంతో వెంటనే స్టాప్ లాక్ గేట్ ను అమర్చేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. నీటి ప్రవాహం అదుపులోకి రాగానే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విరిగిపోయిన మూడవ గేట్ తో పాటు పాడైపోయిన మరో మూడు గేట్లను కూడా యుద్ద ప్రాతిపదికన బాగు చేస్తామని హామీ ఇచ్చారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఏర్పడిన ఈ మరమ్మతుల వల్ల రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, గేట్ల పునరుద్దరణ జరిగిన తరువాత నాగార్జున సాగర్ నుంచి నీటిని నింపుతామని వెల్లడించారు.