రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో నేడు ఓ ముందడుగు పడింది. తొలివిడతలో నిర్మిస్తున్న ఇళ్లకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగాయి. నేటినుంచి మూడు రోజులపాటు రోజుకు లక్ష చొప్పున మూడు లక్షల ఇళ్ళకు మెగా గ్రౌండింగ్ నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
దీనిలో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద లేఔట్ అయిన గుంకలాంలో లబ్ధిదారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఇళ్ళ నిర్మాణం ప్రారంభించారు. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలో రూరల్ మండలం గుంకలాం వద్ద ఏర్పాటు చేసిన 391 ఎకరాల అతి పెద్ద వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీ లేఅవుట్లో 12,301 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వీరందరూ మెగా గ్రౌండింగ్ మేళాలో తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు గురువారం కుటుంబాలతో తరలి వచ్చారు. ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. తమ స్థలాల్లో సంప్రదాయ బద్దంగా నూతన వస్త్రాలు ధరించి భూమి పూజ లో పాల్గొన్నారు
స్ధానిక శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్) మయూర్ అశోక్, ఆర్.డి.ఓ. బి హెచ్ భవానీ శంకర్, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి, మునిసిపల్ కమీషనర్ వర్మ, హౌసింగ్ పీడీ ఎస్.వి.రమణ మూర్తి, స్ధానిక కార్పొరేటర్ లు సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాగారం జిల్లాలో మధ్యాహ్నం 1-00 గంటల సమయానికి 15,137 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం జరిగి రాష్ట్రంలోనే మెగా గ్రౌండింగ్ మేళా లో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు.