Social consciousness: మృత్యుంజయ్ తెలుగులో మంచి కార్టూనిస్ట్. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో పనిచేస్తున్నాడు. అంతకుముందు ఆంధ్రభూమి దినపత్రికలో పనిచేసినప్పుడు నా సహచర ఉద్యోగి. కష్టాలు, కన్నీళ్ల తెలంగాణ పల్లె నుండి పొట్ట చేతపట్టుకుని భాగ్యనగరానికి వచ్చి…సొంత ముద్రతో నిలబడినవాడు. తెలుగు వచనాన్ని ప్రేమించేవాడు. నా వ్యాసాలెన్నిటికో బొమ్మలు వేసినవాడు. నాకు ఆప్తుడు.
జాతీయంగా, అంతర్జాతీయంగా గొప్ప గొప్ప కార్టూనిస్టుల గురించి, వారి రాతల్లో, గీతల్లో ప్రత్యేకతలను నాకు ఏళ్లతరబడి పులకింతగా చెప్పినవాడు. ఇప్పటికీ చెబుతున్నవాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తను వేసిన బొమ్మలు, కార్టూన్లతో పుస్తకాలు వెలువడ్డాయి. వాటిమీద నన్ను సమీక్ష రాయమని అడిగాడు. భాషకు సంబంధించి నా పరిమిత అవగాహనతో రెండు ముక్కలు రాయగలను కానీ…కార్టూన్లు, క్యారికేచర్లు, వర్ణాలు, బ్రష్ స్ట్రోక్ ల గురించి నా అజ్ఞానం బయటపెట్టుకోవడం ఎందుకని రాయలేదు. నెగటివ్ అయినా పర్లేదు…నువ్ ఎలా ఫీల్ అయితే అలా రాయన్నా! అని తను అభయమిచ్చాడు కాబట్టి…ఆ పుస్తకాల మీద విడిగా ఎప్పుడయినా సమీక్ష రాస్తాను.
ఈమధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాద యాత్ర మొదలుపెట్టగానే బి జె పి నాయకులు యాత్ర మొదటిరోజు రాహుల్ వేసుకున్న తెల్ల టీ షర్ట్ గురించి పెద్ద చర్చ మొదలు పెట్టారు. దాని ధర అక్షరాలా 41 వేల రూపాయలట. ఫలానా బ్రాండ్ అని కనుగొని ప్రపంచానికి చెప్పారు.
ప్రధాని మోడీ ఫలానా రోజు ధరించిన చొక్కా, పైన కోటు అక్షరాలా పది లక్షల రూపాయలు అని బ్రాండ్, ప్రయిస్ ట్యాగ్, జి ఎస్ టి అదనం తదితర వివరాలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రపంచంలో ప్రతిదీ కంపారిటివ్. ఏదీ అల్టిమేట్ కాదు.
ఏమాటకా మాట…
డ్రస్ సెన్స్, కలర్ కాంబినేషన్, డ్రస్ స్టయిల్లో సంసారి సన్యాసి అయిన మోడీతో సంసారి కాని రాహుల్ పోటీ పడలేరు.
కొందరి వేషం దేశం కోసం;
మరి కొందరి వేషం ద్వేషం కోసం ఎందుకవుతుందో ఎవరికివారు తెలుసుకోవాల్సిందే.
రాహుల్ విలువయిన టీ షర్ట్; ప్రధాని మోడీ అత్యంత విలువయిన చొక్కాల గురించి జరుగుతున్న చర్చ మధ్యలో సామాన్యుడి గోచీ గుడ్డను ప్రవేశపెడుతూ మృత్యుంజయ్ చక్కటి కార్టూన్ వేశాడు. రెండు భాగాలుగా ఉన్న ఒకే కార్టూన్ లో మాటలు మోయలేనంత భావాన్ని మృత్యుంజయ్ తన కుంచెతో ఆవిష్కరించాడు.
నిజమే.
41 వేల టీ షర్ట్, పది లక్షల కోటు ప్రజలెన్నుకున్న నాయకులు వేసుకోవచ్చు. ఓటు వేసి గెలిపించే సామాన్యులకు మిగిలేది గోచీ పీలికే.
“కాసుకో
కోసుకో
రాజకీయమా!
ప్రజలు
పనసతొనలు
మీరు
కత్తిమొనలు”
అని అలిశెట్టి ప్రభాకర్ అన్న మాటలను కూడా స్మరించుకోవడం తప్ప చేయగలిగింది లేదు.
(cartoon, paper clipping Courtesy: Namaste Telangana)
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :