Thursday, June 11, 2026
HomeTrending Newsకొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు... అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు… అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని  శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.  సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు. మహాత్మాగాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా .. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని 1949లోనే అంబేద్కర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.

‘చట్టాలు చేసే ముందు.. సంస్కరణలు చేసే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి’ అని చెప్పిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు.  ‘లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ’తో సమాజం విలసిల్లాలని  ప్రవచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ‘‘అంబేద్కర్ మార్గదర్శకత్వంలో టీఆర్ఎస్ పనిచేస్తుంది. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపిన ఆదర్శ నాయకుడు కేసీఆర్’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చని తెలిపే ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ కు తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు.

కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాలని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఆ తర్వాత MIM ఎమ్మెల్యే అబ్దుల్ బలాల ప్రభుత్వ తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని..అంతకన్నా అర్హులు మరొకరు లేరని బలాలా అన్నారు.

ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సోమవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) తీర్మానం  ప్రవేశపెట్టింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular