అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసీ) సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎం జగన్ తో పాటు, టిడిపి శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, చీఫ్ విప్ ముడునూరి ప్రసాద రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. 27 అంశాలపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగా, 17అంశాలు చర్చించాలని కోరింది. తెలుగుదేశం ప్రతిపాదించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టిడిపి అడుగుతున్న అంశాలు, తాము చర్చించాలనుకున్న అంశాలూ ఒకటేనని సిఎం పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనికి సిఎం బదులిస్తూ ‘మీరు మాట్లాడితే మావాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, నన్నుఏదైనా అంటే మా పార్టీ నేతలకు కోపం వస్తుంది, వారు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా’ అంటూ సిఎం ప్రతిస్పందించారు. టిడిపి సభ్యులు సంయమనం పాటించాలని జగన్ కోరారు.
కాగా, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. నేడు, రేపు (15,16 తేదీలు) రెండ్రోజులు సభ జరుగుతుంది. 17,18తేదీల్లో సభకు సెలవు. 19,20,21తేదీల్లో మూడు రోజులు సభ సమావేశం అవుతుంది.
Also Read : రాజకీయం చేస్తున్నారు: మంత్రి రోజా