తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ మహాసభలు విజయవాడలో అక్టోబర్ 14 నుంచి 18వరకూ జరగనున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా సిపిఐ జాతీయ నాయకత్వం కేసిఆర్ ను ఆహ్వానించింది.
ఇటీవలి కాలంలో జాతీయ పార్టీ ఏర్పాటు కోసం కేసిఆర్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా పర్యటించి పలు పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేసిఆర్ కలుసుకుంటున్నారు. సిపిఐ నేతలతో గతంలోనే అయన సమావేశమై ప్రగతి భవన్ లో వారికి ఆతిథ్యం కూడా ఇచ్చారు. పైగా, మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్త్తున్నట్లు సిపిఐ, సిపిఎం ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే విజయవాడలో జరిగే మహాసభల్లో పాల్గొనాలని కేసిఆర్ నిర్ణయించారు. అయితే ఈ టూర్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కేసిఆర్ కలుసుకుంటారా లేదా అన్నది రాజకీయంగా చర్చనీయాంశం గా మారింది.