ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన మహిళల స్వావలంబన కోసం ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
పేద అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ పథకాన్ని సిఎం జగన్ ప్రవేశపెట్టారు. అక్కచెల్లెమ్మలకు చేయూత, తద్వారా జీవనోపాధి కల్పన దీని లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 4,949.44 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు అందించనున్నారు. వైయస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750 ల చొప్పున నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందించనున్నారు. ఈ పథకం కింద నేడు అందిస్తున్న 4,949.44 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 14,110.62 కోట్లు
పేద అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, వారి ఆర్ధిక స్ధితిగతులు మెరుగుపడాతాయన్న మంచి ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం అందించిన లబ్ధి అక్షరాలా రూ. 2,39,013.40 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.