తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయయణస్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని ఇరు ప్రభుత్వాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని తెలంగాణ నేతలకు సూచించారు.
రెండు రాష్ట్రాల ప్రజలు సోదర భావంతో మెలగాలని, రెచ్చగొట్టేలా మాట్లాడ వద్దని తెలంగాణ నేతలకు నారాయణ స్వామి మనవి చేశారు. నీరు పూర్తిగా వచ్చినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, సీమకు సాగునీరు కూడా లేకుండా విద్యుత్ కోసం నీటిని వినియోగించడం దారుణమన్నారు. నిజానికి రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న తపన కేసీఆర్‌కు కూడా ఉందన్నారు. జగన్, కేసీఆర్‌కు ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానమని నారాయణస్వామి పేర్కొన్నారు.