ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. త్వరలో ఏపీలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ఈనెల 18న ఏపీలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. అనంతరం తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని ఆయన వివరించారు.
మరో సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని.. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో కుల, మతాల మధ్య భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. విభజించు, పాలించు అనే నినాదంతో ఆ పార్టీ పాలన సాగిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర విభజన ఏపీకి గాయం చేసిందని అంగీరిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదలై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యాత్ర గురించి భయపడుతున్నాయని అన్నారు. భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఏపీలో కాంగ్రెస్ ఖచ్చితంగా బలపడుతుందని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు తులసిరెడ్డి, హర్షకుమార్‌తో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్, సుదాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.