History re-created: ఆర్య- ద్రావిడ వివాదం మీద “లేని ఆర్యులు ఎలా వచ్చారు?” అని…
ఐ ధాత్రిలో పమిడికాల్వ మధుసూదన్ రాసిన వ్యాసం మీద గంగిశెట్టి లక్ష్మీనారాయణ స్పందన; దానికి కోవెల సంతోష్ కుమార్ ప్రతిస్పందన ఇది. యథాతథంగా…
“ఇదొక అర్థం లేని వితండ భారతీయార్య / లేదా, అభినవార్య హిందూ భా.జన వాదం. బ్రిటీష్ చరిత్ర కారులు కానీ,స్వదేశ చరిత్ర కారులు కానీ ఇలాటి బాధ్యతా రహితమైన రాతలు రాయలేదు… సంచార-నొమాడిక్- ఆర్యులు రావటానికి పూర్వమే, ఈ దేశంలో గొప్ప నగర సంస్కృతితో పరిఢవిల్లిన శాంతి కాముక నాగరిక జాతి గా ద్రావిడులు/ అనార్యులను ఆయా చరిత్ర కారులు గుర్తించారు..
వీరు కూడా నైలునదీ ప్రాంతం నుంచి అటు మునుపే భారతంలోనికి వచ్చిన వారుగా కొందరు పరిశోధకులు భావిస్తూ ఉంటే, ప్రపంచ ప్రఖ్యాత ద్రావిడభాషావేత్తల్లో ఒకరైన ఆచార్య భద్రిరాజు గారు, ద్రావిడులు ఆదినుంచి భారత దేశానికే చెందిన వారని భావించారు… ఋగ్వేద కాలానికే సుమారు 300 ద్రావిడపదాలు ఋగ్వేదంలోకి చేరాయని రష్యన్ ఫైలాలజిస్టులు నిరూపించారు… అంటే అప్పటికే వారి మధ్య చక్కటి సన్నికర్ష మొదలైందని అర్థం..
ఆదినుంచి భారతావని అనేక జాతి ప్రజలను తనవైపు ఆకర్షించుకొన్న సుక్షేత్ర సీమ… నేటి అమెరికా లాగా మల్టీ రేసియల్ ఆవాసభూమి.. భిన్న జాతులు ఒకచోట స్థిరపడుతున్నప్పుడు, పరస్పర ఘర్షణలు, బల ప్రదర్శనలు, డార్విన్ సూత్ర నిరూపణలు తప్పవు…
ఆర్యసంతతి, నిస్సందేహంగా మిగిలిన వాటికంటే బౌద్ధిక పరిశ్రమలో, ఆధ్యాత్మిక సంస్కృతి లో ముందంజ వేసింది. త్రై వర్ణ విభజనలో, బౌద్ధిక సాధనలకు డివోట్ అయ్యే ఒక ప్రత్యేక వర్గాన్ని రూపొందించుకొంది.. ఆ సాధనాఫలితంగా రూపొందిన సూత్రాల మీద క్రమేపీ, భారతీయ ఏకత పటిష్టంగా రూపుదిద్దుకొని, ఇప్పటికీ ఈ జాతి ఐక్యతకు మూలశక్తిగా నిలిచి నడిపిస్తోంది… చరిత్ర ను చరిత్రగా చదువుకోవటం వేరు; ఆధునిక భా.జన అవసరాలకు అనుగుణంగా ఎటుబడితే అటు వాడుకోవటం వేరు..
-గంగిశెట్టి లక్ష్మీనారాయణ
——–
గురువుగారు మన్నించాలి.. ఇది కచ్చితంగా వితండవాదం కాదని నా అభిప్రాయం.. భారతీయార్య.. అభినవార్య హిందూ భా.జనవాదం అన్న పేరుతో.. వాస్తవ చరిత్రను అష్ట వంకరలు తిప్పి అత్యంత దారుణంగా హననం చేశారు. పైగా ఈ దేశానికి గొప్పతనాన్ని నామమాత్రంగా ఆపాదించడం కోసం ఈ దేశం ప్రపంచంలోని అనేక జాతి ప్రజలను ఆకర్షించుకొన్నదని చెప్పుకొచ్చారు.
ఆర్య శబ్దం జాతి వాచకం కాదని సోకాల్డ్ మాక్సు ముల్లరే నెత్తీనోరూ బాదుకొని చెప్పుకొచ్చాడు. ఋగ్వేదాన్ని అనువదించాలని 1847 ఏప్రిల్ 14 న ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ముల్లరుకు పని అప్పగించింది. అప్పటికి ఇతనికి సంస్కృతంలో ఉన్నది శృత పాండిత్యమే. అతను సంస్కృతం నేర్చుకోబట్టి సుమారు ఆరేండ్లు మాత్రమే అవుతున్నది. అసలు వయసే 24 ఏండ్లు. ఇంత పాండిత్యమున్న మేధావి ఋగ్వేదాన్ని అనువదించడానికి పూనుకున్నాడు. ఇతని టార్గెట్ అంతా.. వేదకాలాన్ని ముందుకు జరపాలి. వేదాల నుంచి ఈ సంక్రమించిన విజ్ఞానాన్ని భారత సమాజం నుంచి వేరుచేసి చూపడమే. ఈ విషయాన్ని నిస్సిగ్గుగా ముల్లరే ఒప్పుకున్నాడు. 1866లో తన భార్యకు రాసిన ఈ ఉత్తరం.. ఆయన మాటల్లోనే…
“I feel convinced though I shall not live to see it that this edition of mine and the translation of the veda will hereafter tell to a great extent on fate of India.. It is the root of their religion. and to show them what that root is, I feel sure, is the only way of uprooting all that has sprung up from it during the last 3000 years.” తాను రాసే ఈ వేదభాష్యం ఇండియా తలరాతను మార్చేస్తుందని, మన మతానికి అదే తల్లివేరు కాబట్టి, ఆ తల్లివేరును పెకిలించి చూపించడమే తన లక్ష్యమని చెప్పుకొన్న వాడు.
ఇదే మ్యాక్సు ముల్లర్ అంతకుముందు కార్ల్ జోసియాస్ వాన్ బున్సెన్‌కు రాసిన ఓ లేఖలో భారతదేశంలో క్రైస్తవమతం గ్రీకు, రోమన్ దేశాలకంటే కూడా పరిపక్వ దశకు చేరుకున్నదని, వాళ్ల ప్రాచీన మతం చెదలుపట్టి ఏ క్షణాన్నైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని, ఏదో కృత్రిమమైన ఊత కర్రల సహాయంతో మనుగడ సాగిస్తున్నదని.. దీన్ని ఇంగ్లిష్‌వారు గ్రహిస్తే చాలు.. భారత్ పని అయిపోయినట్టే నని రాసుకొచ్చాడు. ఆ తరువాత కూడా మరో లేఖలో (ఇండియాకు విదేశాంగమంత్రిగా వచ్చిన ఆర్గిల్ డ్యూక్‌కు రాసినది) ఇండియాలోని ప్రాచీన మతం వినాశనానికి సిద్ధంగా ఉన్నది. క్రైస్తవం అక్కడ అడుగుపెట్టకపోతే తప్పు ఎవరిది? అంటూ ప్రశ్నించాడు కూడా. క్రైస్తవ మిషనరీలకు సహాయపడటమే తన ధ్యేయమని కూడా చెప్పుకున్నాడు.
ఇవన్నీ బహిరంగమే కదా.. ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ అన్న గ్రంథంలో ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ డాక్యుమెంట్లు. ఇందులోనే మరికొన్ని విషయాలు చూడండి.. దాదాపు 19 ఏండ్లపాటు వేదాలకు అడ్డగోలుగా అనువాదాలుచేసి, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని వేదికనెక్కిన ప్రతిచోటా వాగిన మాక్సుముల్లర్ నాలుక మడతపడింది. అర్యులు అన్నది జాతి కాదు.. భాష అని ప్రచారంచేయడం మొదలుపెట్టాడు. ‘నేను ఆర్యులు అంటే రక్తం, ఎముకలు, పుర్రె, జుట్టు అనే అర్థంలో చెప్పలేదు. ఆర్యులు అంటే ఆర్య భాష మాట్లాడేవారు అనే అర్థంలోనే చెప్పాను’ అని నెత్తీనోరూ బాదుకున్నాడు. ఇందుకు కారణాలు సవాలక్ష ఉండవచ్చు. జర్మన్‌లలో ఆర్యజాతి భావన ప్రబలడం, జాతీయత బలోపేతం చేయడం, సంస్కృతాన్ని సొంతంచేసుకొనే ప్రయత్నంచేయడం.. ఆ తర్వాత యుద్ధంలో ఫ్రాన్సును ఓడించడం వంటి పరిణామాలు అనేకం ముల్లర్ మాట మార్చడానికి కారణాలు అయ్యాయి. బ్రిటిష్ చరిత్రకారులు, స్వదేశీ చరిత్రకారులు అత్యంత బాధ్యతారాహిత్యంతోనే చరిత్ర రాశారు. ఆ తరువాతి తరం చరిత్రకారులు వాళ్లను అనుసరించడం వల్లనే ఈ వక్రీకరణ కొనసాగుతూ వచ్చింది. మేక కుక్కలా మారిపోయింది.
రాముడు ఆర్యుడని.. రావణుడు ద్రావిడుడని.. ఆర్యుడైన రాముడు.. అమాయకుడు, బుద్ధిమంతుడు అయిన ద్రవిడ రావణుడిని అన్యాయంగా హతమార్చాడని కథలు చెప్తారు. కానీ రామాయణం చదివిన తరువాత.. యుద్ధకాండలోని 110 సర్గలో సదరు రావణుడు చనిపోయిన తర్వాత యుద్ధరంగానికి వచ్చిన మండోదరి.. తన భర్త భౌతికదేహాన్ని చూసి ‘అయ్యో! ఆర్యపుత్రా! నాథా! నాథా! అని భోరున విలపిస్తుంది. ఇక్కడ రావణుడు ఆర్యుడెలా అయ్యాడు. మనకు వాల్మీకి రామాయణం ప్రమాణమే కదా.. అందులో ఉన్నమాటే ఇది. పోనీ ఆర్యుడు అంటే అర్థం ఏమిటి? ఈ పదానికి కనిపిస్తున్న అర్థం.. సంస్కారం కలిగినవాడు అని. ‘మహాకుల, కులీనార్య, సభ్య, సజ్జన, సాధవ:’ అని అమరకోశం సహా పలు నిఘంటువులు అర్థాల్ని చెప్తున్నాయి. ఆర్యుడు అంటే మంచి కులంలో పుట్టినవాడు, కులీనుడు, సభ్యత తెలిసినవాడు, సజ్జనుడు, సాధువు.. అని అర్థం. ఇక్కడ జాతి అర్థం ఎక్కడ్నించి పుట్టుకొచ్చింది.
సామాజికంగా, ఆర్థికంగా, నాగరికంగా తిరుగులేని ఆధిక్యంతో ఉన్న భారత్‌ను సమూల చ్ఛేదనచేసి క్రైస్తవ మత రాజ్యంగా మార్చడానికి జరిగిన కుట్రలో వేసిన తొలి అడుగు ఆర్య సిద్ధాంతం పుట్టుక. సదరు మాక్సుముల్లర్‌తోపాటు మిగతా పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తప్పులైనా సమర్థించుకొనేలా ఉన్నాయా అంటే అదీ లేవు కదా? వీళ్లు చెప్పే హేతువాదానికీ చిక్కడంలేదు కదా.. ఉదాహరణకు మాక్సుముల్లర్ కట్టిన లెక్కలే చూద్దాం.. It may sound prejudiced. But taking all in all, I say the new testament. After that I should place koran.. then would follow, according to my opinion, the old testament, the southern buddhist tripitaka, the taote, king of leo-tze, the kings of Confucius, the veda, and the avesta.. (the life and letters of Max Muller vol.2 page 322-23)
దీన్ని చూస్తే విడ్డూరంగా కనిపించదా? ముందుగా న్యూ టెస్టమెంట్ అంట.. ఆ తర్వాత ఖురాను, అనంతరం ఓల్డ్ టెస్ట్‌మెంట్, తర్వాత బుద్ధుల త్రిపీటికలు, టావోటే, లియో జె రాజులు, కన్ఫ్యూషియస్ రాజులు, వేదాలు, అవేస్తలు.. ఇలా వాటి కాల పరిణామ క్రమాన్ని ముల్లర్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతకంటే దారుణమైన అబద్ధమేముంటుంది? బౌద్ధం పుట్టిందే ఉపనిషత్తుల ఆధారభూమికపై. బుద్ధుడు ఉపనిషత్తులను తిరస్కరించనే లేదు. ఈ ఉపనిషత్తులకు ఆధారభూతం వేదాలు. అలాంటిది.. బుద్ధుడి త్రిపీటికల తర్వాత ఎంతోకాలానికి వేదాలు పుట్టుకొచ్చాయని రాయడంలో లాజిక్ ఏమిటో ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. బైబిల్‌లో క్రీస్తుకు పూర్వం 4004లో ప్రళయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ నంబర్‌ను పట్టుకొని.. కాకి లెక్కలు కట్టి క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల్లో ఋగ్వేదం రాశారని చెప్పాడు. బుద్ధుడి తర్వాత వేదాలొచ్చాయని ఆయనే చెప్తాడు.. క్రీపూ 1500 లో ఋగ్వేదం రాశారనీ ఆయనే చెప్తాడు. ఆ తర్వాత ఇదే పెద్దమనిషి మాటమార్చాడు. “whether the vedic hymns were composed 1000, 1500, 2000, 3000 bc.., no power on earth will ever determine” ఇది మన రోమిలాథాపర్‌లు, హబీబ్‌లు, జేఎన్‌యూ, ఏఎంయూ స్వయం ప్రకటిత చరిత్రకారుల మెదళ్లలోకి ఎక్కలేదు. కమ్యూనిస్టులనైతే అడుగనే అక్కర్లేదు.
భారతదేశంలో అత్యంత విఖ్యాతమైన జవహర్‌లాల్ యూనివర్సిటీ చరిత్ర ఆచార్యులు రోమిలా థాపర్ ‘ఏన్షియంట్ ఇండియా’ అని ఒక పాఠ్యపుస్తకం రాశారు. అందులో వారు రాసిన కొన్ని అంశాలు.. ‘మొహంజొదారో అవశేషాలు బయటపడేంతవరకూ కూడా భారత చరిత్ర ఆర్యుల దండయాత్రతోనే మొదలైందని భావిస్తూ వచ్చాం. ఆర్యులు భారతదేశం అవతలి ప్రాంతాలనుంచి అంటే ఇరాన్‌కు ఈశాన్య ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం గుండా వచ్చి భారత్‌లో సెటిల్ అయ్యారు. ముందుగా పంజాబ్‌లో వీళ్లు స్థిరపడ్డారు. తరువాత ఢిల్లీ దాకా వలసవెళ్లారు. నాలుగు వేదాలు వీళ్లే రాసుకొన్నారు. సరస్వతి నదీతీరంలో నాగరికతను అభివృద్ధి చేసుకొన్నారు. సింధు నాగరికతతో వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్లు భారత్‌కు వచ్చిన తొలిరోజుల్లో ఎలాంటి నగర నిర్మాణాల గురించి తెలియదు. తరువాత నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందారు. వీళ్లు అద్భుతమైన నగరాలను నిర్మించడానికి తర్వాత కనీసం వెయ్యి సంవత్సరాలు పట్టింది. వ్యవసాయం చేశారు. వ్యాపారం చేశారు. నగరాలను కూడా నిర్మించడం మొదలుపెట్టారు. మొత్తంమీద భారతదేశానికి ఒక చరిత్రనంటూ సృష్టించారు.’ ఇదీ రోమిలా థాపర్ ఆర్యుల దాడి గురించి రాసిన మాటలు..
ఇందులోనూ మళ్ళీ కొన్ని అనుమానాలు పుట్టుకొస్తాయి. ఆర్యులు అనేవారు ఇరాన్‌లోని ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారని థాపర్ రాశారు. హరప్పా మొహంజొదారో నాగరికత క్రీపూ. 1500 సంవత్సరంలోనో.. దరిదాపుల్లోనో అంతమైంది. (రకరకాల కారణాల వల్ల).. వాతావరణ మార్పు వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయిందన్నది ఒకానొక సిద్ధాంతం. సింధు నాగరికత పైన బలూచిస్తాన్ నుంచి కింద గుజరాత్ వరకు విస్తరించింది కదా.. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిందా? కేవలం షుగ్గర్ నది ఇంకిపోయిన ప్రాంతమే ఎడారిగా మారిందా? ప్రస్తుతం మనకు కనిపిస్తున్న థార్ ఎడారి ప్రాంతం మాత్రమే సింధునాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతమా? ఎందుకంటే.. సింధునాగరికత అంతం.. భారత్‌కు ఆర్యుల రాక ఇంచుమించు ఒకేసారి జరిగిందని థాపర్ కానీ.. అంతకుముందు చరిత్రకారులందరి వాదన. ఈ ఆర్యులకు సింధు నాగరికతతో ఎలాంటి పరిచయం ఎందుకు లేదన్నది ప్రశ్న. ఇరాన్ నుంచి భారత్‌వైపు రావాలంటే.. ఎక్కడైతే సింధు నాగరికత అభివృద్ధి చెందిందో ఆ ప్రాంతం దాటకుండా రావడానికి ఎంతమాత్రం వీలులేదు. ఒకసారి గూగుల్ మ్యాప్‌ను చూస్తే గూగుల్ తల్లి ఇదే చెప్తుంది. కానీ.. ఇరాన్ నుంచి భారత్‌కు వలసవచ్చినారంటున్న ఆర్యులకు అప్పుడప్పుడే అంతమవుతున్న, మైన సింధు నాగరికత ఆనవాళ్లైనా కనిపించలేదా?
రెండో అనుమానం ఏమిటంటే.. ఈజిప్టులోని సుమేరియన్లతో హరప్పా, మొహంజొదారో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాపారం చేశారని థాపర్ ఇదే పుస్తకంలో పిల్లలకు పాఠం చెప్పారు. సంతోషం. ఈ వ్యాపారులు సుమేరియన్‌కు ఎట్లా వెళ్లారన్నది ప్రశ్న. మధ్యలో ఇరాన్ తగలకుండా పోవడం సాధ్యం కాదు. భూమార్గంలో వెళ్తే కచ్చితంగా ఇరాన్ మీదుగా వెళ్లాలి.. సముద్రమార్గం ద్వారా వెళ్లాలన్నా ఇరాన్ సరిహద్దులను తాకుతూనే వెళ్లాలి. ఇంత పెద్ద వ్యాపారం చేసినవారికి ఇరాన్‌లో ఉన్నారని చెప్తున్న ఆర్యులు ఎప్పుడూ తగులలేదా? వారితో హరప్పా ప్రజలు వ్యాపారం చేయలేదా? ఇరాన్‌లో ఉన్న సదరు ఆర్యులకు సింధు సమాజం గురించి తెలిసే అవకాశమే లేకుండా పోయిందా?
ఆర్యులు వచ్చిన తర్వాత మొట్ట మొదట పంజాబ్‌లో స్థిరపడ్డారని రోమిలా థాపర్ రాశారు. పంజాబ్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో సింధు నాగరికత అభివృద్ధి చెందిందని కూడా ఆమే అంతకుముందు పాఠంలో చెప్పారు. ఆర్యులు పంజాబ్ వచ్చేసరికి అక్కడ ప్రజలు లేరా? వారు సింధు నాగరిక సమాజానికి చెందిన వారు కాదా? వారే అయితే.. ఆర్యులు తిరిగి అద్భుత నిర్మాణాలు చేపట్టడానికి వెయ్యేండ్లు ఎందుకు పట్టింది?.. అప్పటికే సింధు ప్రజలు అద్భుతమైన భవనాలు.. నగరాలు నిర్మించారని చెప్పుకుంటున్నాం కదా. కొత్తగా వీరు ఆయుధాలు, పనిముట్లు, వ్యవసాయం వంటివి కనిపెట్టడం ఎందుకు అవసరమైంది. అంటే పంజాబ్‌లో ఆర్యులు వచ్చినప్పుడు అది ఎడారిగా మారి ఉండి ఉండాలి. ఆ ఎదారిలోకి వీరు వచ్చి ఆ ప్రాంతాన్ని అత్యాధునిక వ్యవసాయక్షేత్రంగా మలచి ఉండాలి. ఏమో మరి.!!!!. .
వాతావరణంలో మార్పుల కారణంగా షుగ్గర్ నది అలియాస్ సరస్వతి నది ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారి సింధు నాగరికత అంతమైందన్నది చరిత్రకారుల వాదన. అలాంటప్పుడు ఆ తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులనబడేవారు సరస్వతి నదీతీరంలోనే జీవించారని రాశారు. ఆ తరువాత అది ఎండిపోయిందన్నారు. ఈ రెంటిలో ఏది రైటు.. ఏది రాంగు.. ఎవరు చెప్పాలి? క్రీస్తుపూర్వం 1500లో ఆర్యులు వచ్చారని వీరే చెప్తారు. వచ్చేనాటికి వీరికి నగర జీవితం గురించి తెలియనే తెలియదు.. తెలుసుకోవడానికి కనీసం వెయ్యేండ్లు పట్టిందనీ వీరే చెప్తారు. కానీ క్రీస్తు పూర్వం 1400 (ఆర్యులు వచ్చిన వందేండ్లకే) సంవత్సరం లో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని లెక్కలు చెప్తారు. నగరజీవితం గురించి ఎంతమాత్రం తెలియని ఆర్యులు ఇక్కడికి వచ్చిన వందేండ్లకే కురు మహాసామ్రాజ్యం స్థాపించి.. మహాసంగ్రామం చేశారా. మహా మారణ హోమం జరిగిందా?
ఈ చరిత్రను ఏ సిరాతో రాశారో.. అంతుపట్టని సందేహాలు.. జవాబులు లేని ప్రశ్నలు.
-కోవెల సంతోష్ కుమార్