Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆర్య ద్రావిడ వివాదం

ఆర్య ద్రావిడ వివాదం

Unfair History: ఆర్య- ద్రావిడ వివాదం ఒక ఎడతెగని చర్చ. అంతకు ముందు ఇది వివాదం కాదు కానీ…బ్రిటీషు వారు వచ్చాక మనం మనం కాదని; మనకొక సంస్కృతి, వారసత్వాలేవీ లేవని; పరమ అనాగరికంగా ఒంటిమీద బట్టలు కూడా లేకుండా ఆకులు అలములు చుట్టుకుని బతుకుతూ ఉండిన మనల్ను త్రిబులెక్స్ సంస్కారవంతమయిన సోపులు పెట్టి కొన్ని తరాల పాటు బయటనుండి వచ్చినవారెవరో ఉతగ్గా…ఉతగ్గా…ఇప్పుడు ఈ మాత్రం మనుషులుగా మనకొక గుర్తింపు వచ్చిందని బలంగా నమ్ముతున్నాం.

“అంతకుముందు మనం మొరటు ద్రావిడులం. ఆర్యులు వచ్చి మనకొక బతుకును ప్రసాదించేదాకా మనకు వ్యవసాయం తెలియదు. పండుగలు పబ్బాలు తెలియవు. ఆచారాల్లేనే లేవు. సంస్కృత భాష మనది కానే కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఏర్పడడానికి ఆర్యులే కారణం” అన్నది బ్రిటీషువారి నిర్ణయం. మాక్స్ ముల్లర్ వేదాలను చదివి ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చి పారేశాడని ఎడమ చూపు మేధావులు కూడా కుడి కన్ను మూసుకుని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముల్లర్ మూట కట్టి ఇచ్చిన వితండవాదాన్నే నెత్తికెత్తుకున్నారు.

మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ద్రావిడులమయిన మనం రావణాసురుడి సంతతివారమని; రాముడు ఆర్యుడని; అందుకే సీతమ్మ పదే పదే రాముడిని ఆర్యా! ఆర్యాపుత్రా! అని పిలిచిందని పురాణ పాండిత్యాన్ని కూడా ప్రదర్శించి ఆర్యులు చెప్పిన పాఠాలను ద్రావిడులు నెమ్మదిగా నేర్చుకున్నారని తేల్చి పారేశారు.

రాముడు ఆర్యుడని చెప్పడానికి ప్రయత్నించేవారి ప్రకారం రావణాసురుడు కూడా అక్షరాలా ఆర్యుడే కావాలి కానీ…ద్రవిడుడు కావడానికి అవకాశమే లేదు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు. పులస్త్యుడి కొడుకు విశ్వ వసో బ్రహ్మ. ఆ విశ్వ వసో బ్రహ్మ కొడుకు రావణాసురుడు. అంటే రావణుడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ముని మనవడు. బ్రహ్మ ఆదేశం మేరకు కుబేరుడికోసం బంగారు లంకను దేవ శిల్పి నిర్మిస్తే…కుబేరుడిని తన్ని తగలేసి పుష్పకవిమానంతో పాటు స్వర్ణ లంకను రావణుడు ఆక్రమించాడు. అంటే…లంకకు రావణుడు నాన్ లోకల్. ఎక్కడినుండో వచ్చి, తనది కాని అంతఃపురాన్ని కబ్జా చేసి…అనుభవించాడు. అందుకే అలా పోయాడు. ఇది తెలియక రావణుడు లోకల్ ద్రవిడయన్ అనుకుని ఇప్పటికీ కొందరు రావణుడి ఆరాధనలో తరిస్తున్నారు.

ఆర్య- ద్రావిడ అన్న వివాదమే లేదని…ఇదంతా ఇంగ్లీషువారు భారతీయ సంస్కృతిని తక్కువ చేయడానికి; భారతీయత అన్న ఒక భావనకే పెద్ద చరిత్ర లేదని; ఉన్నా అది ఎవరో బయటివారు భిక్షగా పెట్టింది తప్ప ఇక్కడ దానికదిగా ఎప్పుడో పుట్టి…వికసించి…స్థిరపడినది కాదని గాలిని పోగుచేసి బ్రిటీషు దృష్టి మేధావులు ఇన్నాళ్లుగా ఎలా చెబుతూ వచ్చారో వివరిస్తూ తెలుగులో ఈమధ్య రచయిత ఎస్ వి శేషగిరి రావు సంక్షిప్త భారత దేశ చరిత్ర(వేదకాలం నుండి 1947వరకు) పేరిట ఒక పుస్తకం ప్రచురించారు. దాని మీద ఎక్కడో ఒక మూల కొంత చర్చ జరుగుతోంది. ఆ పుస్తకంలోని ఒక భాగాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీ “ఆర్యుల దండయాత్ర ఓ కట్టు కథ, కుట్ర కథ!” పేరిట ప్రత్యేక వ్యాసంగా ప్రచురించింది.

ఆసక్తి ఉన్నవారు ఆ చారిత్రిక ఆధారాలతో ఉన్న కొన్ని గ్రంథాలను చదవవచ్చు. ఆ వివరాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. భాషాపరమయిన ఆర్య- ద్రావిడ వివాదానికే నేను పరిమితమవుతాను.

ఆర్య అంటే గౌరవింపదగినవాడు; సంస్కారవంతుడు, సభ్యతగలిగినవాడు; ధర్మాన్ని పాటించేవాడు అనే అర్థాలున్నాయి. మనం ఈరోజుల్లో గౌరవనీయ, శ్రీ, పూజ్యులు అని గౌరవవాచకంగా పేరుముందు ఎలా వాడుతున్నామో ఆర్యా! ఆర్యపుత్రా! అన్నా అదే అర్థం తప్ప ఆ పిలుపు జాతివాచకం కాదు. స్వామీ! అయ్యా! మహాప్రభో! లాంటి ఒకానొక పిలుపు.

ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. భారతంలో ఆంధ్రులు పాండవుల వైపు నిలబడ్డారని మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి పెద్దలు చెప్పారు.

ఐతరేయ బ్రాహ్మణంలో, భారతంలో ఉన్న ఆంధ్ర ఇప్పటి ఆంధ్ర ఒకటేనా? కాదా? అని తేల్చి చెప్పడం చాలా కష్టం. అప్పటికి తెలుగు లేదా? అప్పటి ఆంధ్ర భాషావాచకం కాక జాతివాచకమనే అనుకోవాలా? లేక ఆంధ్ర భాష ఉన్నా…లిపి లేదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

ఉత్తరాది నుండి అగస్త్యుడు వింధ్య దాటి దక్షిణాదికి ఎప్పుడో వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మనమందరం ఒప్పుకున్నాం. ఇక్కడికొచ్చి తమిళం నేర్చుకుని అగస్త్యుడు తమిళంలో కావ్యం కూడా రాశాడని తమిళులు గొప్పగా చెప్పుకుంటారు. అగస్త్యుడు పదహారణాల తెలుగువాడేనని సిరివెన్నెల సీతారామశాస్త్రి అనేక సార్లు చెప్పారు.

విష్ణుసహస్రనామాల్లో “చాణూరాంధ్ర నిషూదనః” అని ఒక నామం. చాణూరుడు, ఆంధ్రుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించిన విష్ణువు అని కొందరు దీనికి విపరీతార్థం చెప్పారు. సంస్కృతంలో ఏకవచనం, ద్వి వచనం, బహువచనం స్పష్టంగా ఉంటాయి. వీరు ఇద్దరయితే చివర ద్వి వచనాన్ని సూచించే ఔ రావాలి. ఇక్కడున్నది చాణూరాంధ్ర ఏకవచనం. ఒక్కడే. మరి…మల్లాది వారి పురాణాల అన్వయం ప్రకారం ఆంధ్రులు పాండవులవైపు నిలబడితే…కృష్ణుడు ఆంధ్రులను ఎందుకు చంపుతాడు? విష్ణు సహస్రం భారతంలో అంతర్భాగం. అంతకుముందు అవతారాల్లో విష్ణువు సంహరించిన రాక్షుసుల్లో చాణూరాంధ్రుడు ఉన్నాడా? భారతంలో ఉన్న ఆంధ్రులు ఇప్పుడు తెలుగువారమయిన ఆంధ్రులు ఒకరేనా? వేరు వేరా?

సంస్కృత సాహిత్యంలో ఎక్కడా “ఆర్య” అన్న మాట జాతివాచకంగా లేదు. ఒక సంబోధనను జాతిగా భ్రమించి లేదా జాతిగా ముద్ర వేయడానికి ప్రయత్నించి…సంస్కారమున్నవారందరు ఆర్యులు అయినట్లు, సంస్కారం లేనివారందరూ అనార్యులు అని చరిత్రలో వేన వేల పేజీలు రాయడం మాత్రం దక్షిణాదికి తీరని అవమానం.

History And Civilization

“ఆర్యులు” అంటే సభ్యత, సంస్కారం ఉన్నవారు అయినప్పుడు అవిలేనివారు “అనార్యులు” అవుతారు. భూగోళంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒకే జాతిలో సభ్యత ఉన్నవారు లేనివారు కలిసే ఉంటారు. నిష్పత్తిలో తేడా ఉండవచ్చు.

రాముడు లేదా ఇక్ష్వాకులు ఆర్యులు అని వీరి నిర్ణయం. రాముడు పదకొండు వేల సంవత్సరాలు, ఆయన తండ్రి దశరథుడు అరవై వేల ఏళ్లు, ఆయన పిల్లలు లవకుశులు పద్నాలుగు వేల సంవత్సరాలు భూమిని పాలించారు. రఘువంశ ప్రభువులందరి పాలన ఇంకెన్ని వేల ఏళ్ళుంటుందో? ఈలెక్కన సరయూనదీ తీర అయోధ్యకు వాళ్లు ఎప్పుడు వలస వచ్చారో? ఎక్కడినుండి వచ్చారో వీరు చెప్పగలరా?

వేదాల్లో, పురాణాల్లో ఉన్న కాల ప్రమాణాలు, ఆయుః ప్రమాణాలను ఇప్పటి కాల ప్రమాణాలతో లెక్కగట్టకూడదు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగం అయ్యాక మళ్లీ కృతయుగమే వస్తుంది. ఆ లెక్కలు ఇక్కడ అనవసరం.

యూరోపియన్ భాషల్లో కొన్ని మాటలు సంస్కృతాన్ని పోలి ఉంటాయి కాబట్టి…ఆ భాషలన్నీ సంస్కృతం నుండే పుట్టాయని కుడి చూపు ఉన్నవారు పొంగిపోయి చెప్పే విషయం కూడా ఒక స్థాయి దాటిన తరువాత తర్కానికి నిలబడదు.

మాతృ- మదర్
భ్రాతృ- బ్రదర్
నవ- నైన్

సంస్కృతం ధాతుజన్యమయిన భాష. ఎన్నెన్ని పదాలతో అయినా సుదీర్ఘ సమాసాన్ని నిర్మించవచ్చు. మిగతా భాషల్లో అది సాధ్యం కాదు. సాధ్యమయినా సహజంగా ఉండదు.

History And Civilization

వెయ్యేళ్లు వెనక్కు వెళితే రాజమహేంద్రవరం తెలుగు రాజు నరేంద్రుడు తమిళ రాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కొన్ని వందల కుటుంబాలు తమిళనాడు నుండి రాజమండ్రి వచ్చి స్థిరపడ్డాయి. అలాగే గోదావరీ తీర మంథని ప్రాంతంలో కూడా తమిళనాడునుండి వచ్చి స్థిరపడ్డ కుటుంబాలున్నాయి. వెయ్యేళ్లు దొర్లిపోయేసరికి ఇప్పుడు వారికి తమిళ మూలాలతో సంబంధాలే ఉండకపోవచ్చు. కానీ ఏవో కొన్ని విషయాల్లో తమిళ సంప్రదాయాలు మిగిలి ఉండవచ్చు.

పాత కర్నూలు జిల్లా, ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుండి వెళ్లి తమిళ తిరువారూరు, తిరువాయూరుల్లో స్థిరపడ్డ తెలుగు త్యాగయ్య తమిళ సంప్రదాయ సంగీతకళాకారుల నోళ్ళల్లో తెలుగుగా ఇప్పటికీ ఉన్నాడు.

“కర్ణాటక సంగీతం” అని మనమిప్పుడు అంటున్న దక్షిణ భారత సంప్రదాయ సంగీతానికి ప్రామాణికమయిన సంగీత శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా ఆ పేరే లేదు. నిజానికి చెవులకు ఇంపయిన అన్న అర్థంలో కర్ణ ఆట కలిసి కర్ణాటక సంగీతం అయ్యిందని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ లాంటి పెద్దలు అంటారు. మొత్తమ్మీద కర్ణాటక సంగీతం అంటే కన్నడకు సంబంధించినది కాదన్నది స్పష్టం.

“ఆర్యులు” అన్నది కూడా “కర్ణాటక సంగీతం” లాంటి పొరబడిన మాటే అయి ఉండాలి.

మధ్య ఆసియా నుండి లేని ఆర్యులు ఉత్తర భారతానికో, దక్షిణ భారతానికో వచ్చారనుకుంటే…ఆఫ్ఘనిస్తాన్ లో రెండు ద్రావిడ భాషలు ఇప్పటికీ ఉండడాన్ని, ఉత్తరభారతంలో రెండు మూడు ప్రాంతాల్లో ద్రావిడ భాషలు మిగిలి ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

భక్తి విశ్వాసాల్లో, ఆచార కర్మకాండల్లో ఇప్పుడు సంస్కృతం వాడుతున్నాం. సంస్కృతం లేక ముందు ద్రావిడ భాషల్లో అవే తంతులు స్థానిక భాషల్లో తప్పనిసరిగా ఉండి ఉంటాయి. అర్థం కాని భాషలో గాంభీర్యాన్ని, గౌరవాన్ని వెతుక్కోవడం మనకు అనాదిగా అలవాటే. “సరస్వతీ నమస్తుభ్యం” అన్నప్పుడు ఉన్న గాంభీర్యం “తల్లీ! నిన్ను తలంచి” అన్నప్పుడు మనకు దొరకదు. “నిండు నూరేళ్లు చల్లగా ఉండండి” అన్నా “శతమానం భవతి” అన్నా ఒకటే. పైగా సంస్కృతం పలకడం తెలియక పొరపాటున “సతమానం భవతి” అంటే ఆ ఉచ్చారణా దోషాశీర్వచనం ప్రకారం ఒకరినొకరు సతాయించుకుంటూ ఉండాల్సి వస్తుంది.

సంస్కృతంలో శబ్దాన్ని బట్టి లింగావచనాలుంటాయి.
భార్య
దారా
కళత్రం…
మూడు మాటల అర్థం భార్యే అయినా ఒకటి స్త్రీ లింగం, ఒకటి పుంలింగం, ఒకటి నపుంసకలింగం.

ద్రావిడభాషల్లో శబ్దంతో సంబంధం ఉండదు. అర్థాన్ని బట్టే లింగవచనాలు.

ఇప్పుడు బాగా చదువుకున్నవారు 75 శాతం ఇంగ్లీషులో మాట్లాడుతూ పాతిక శాతం మాత్రమే మాతృభాషలో మాట్లాడుతున్నట్లు… అప్పుడు 75 శాతం సంస్కృతం నింపి పాతిక శాతం మాత్రమే మాతృభాషకు అవకాశమిచ్చేవారు.

ఎప్పుడయినా-
కొత్త ఒక వింత;
పాత ఒక రోత- అంతే.

History And Civilization

ఒక భాషను మరో భాష ప్రభావితం చేయడానికి సవాలక్ష కారణాలు. ఒక సంస్కృతి మరో సంస్కృతిని మింగేయడానికి అనేకానేక కారణాలు.
కొన్ని అవసరాలు. కొన్ని వ్యామోహాలు. కొన్ని తప్పనిసరి. కొన్ని కుట్రలు. కొన్ని ఆధిపత్య ధోరణులు. కొన్ని ప్రమాదాలు. కొన్ని ప్రమోదాలు.

ప్రపంచ సాహితీ చరిత్రలో రక్తమాంసాలతో పుట్టిన ఒక మనిషి శంకరాచార్యుడు తిరిగినట్లు కాలినడకన తిరుగుతూ ఆయన ఇచ్చినంత సాహిత్యాన్ని లోకానికి ఇచ్చాడా?

ప్రపంచంలో ఎవరయినా అరవై, డెబ్బయ్యేళ్ళ జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత సాహిత్యాన్ని సృష్టించగలిగారా?

ప్రపంచంతో కలిసి పరుగులు పెడుతున్నా…ఒక్కో జాతికి, ఒక్కో భాషకు తనదయిన ఒక సంస్కృతి, చరిత్ర, వైవిధ్యం ఉంటాయి. వాటిని గుర్తించకపోతే నష్టమేమీ లేదు…వాటిని తుడిచిపెట్టాలని ప్రయత్నించడం మాత్రం బరితెగింపు. అభ్యంతరకరం.

ఏమాత్రం సభ్యత, సంస్కారం లేని దక్షిణాది ద్రావిడులు లేదా ఉత్తరాది భారతీయులు ఆర్యులు వచ్చాకే సభ్యత, సంస్కారాలను నేర్చుకున్నారన్న చరిత్రకారులందరికీ అణుమాత్రం సభ్యత, సంస్కారాల్లేవని నా నమ్మకం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆహారం – ఆరోగ్యం

Also Read :

పుష్పక విమానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్