ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా ‘కాంతార‘ మాటే వినిపిస్తోంది. కన్నడలో ఈ సినిమా చేస్తున్న రికార్డుస్థాయి వసూళ్లను గురించి మాట్లాడుకుంటున్నారు. క్రితం నెల 30వ తేదీన ఈ సినిమా కన్నడలో రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను హోంబలే వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రిషబ్ శెట్టి ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. 11 రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 58 కోట్లను వసూలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లోను చర్చనీయాంశమైంది.
తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేస్తుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా కంటెంట్ డిఫరెంట్ గా ఉందనీ .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాను చూడాలనుకునే వారు ఈ సినిమాకి వెళ్లొచ్చని నిన్న జరిగిన ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు. సినిమా చివరి 40 నిమిషాలను తాను ఉగ్గబట్టుకుని చూశానని అన్నారు. ఫారెస్టు నేపథ్యంలో .. విష్ణు తత్త్వాన్ని చాటుతూ నడిచే ఈ కథను తాను చాలా ఎంజాయ్ చేశానని ఆయన చెప్పారు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. కంటెంట్ పై బలమైన నమ్మకం ఉంటే తప్ప అల్లు అరవింద్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనే విషయం అందరికీ తెలుసు.
ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అరవింద్ కశ్యప్ కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచినట్టుగా చెబుతున్నారు. కంటెంట్ పరంగా పూర్తిగా విభిన్నమైనదే అయినా, కన్నడలో ‘కేజీఎఫ్’ తరువాత ఆ స్థాయిలో మాట్లాడుకుంటున్న సినిమా ఇది. ‘కేజీఎఫ్’ మాదిరిగానే ఈ సినిమా టాలీవుడ్ లోను భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ కథ ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.
Also Read: అక్టోబర్ 15న రిషబ్ శెట్టి “కాంతారా” విడుదల