రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిజెపి సీనియర్ నేతగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దత్తాత్రేయ నాలుగుసారు సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. వాజపేయి, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాల్లో పట్టణాభివృద్ధి, రైల్వే, కార్మిక శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. అయన స్థానంలో కిషన్ రెడ్డిని పోటీలోకి దింపింది.
2019 సెప్టెంబర్ లో దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నరల నియామకం, పలువురు గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు మార్పు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా దత్తాత్రేయను హర్యానాకు పంపారు.