మునుగోడ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పిన తర్వాత BJP నేతలు ప్రజలను ఓట్లు అడగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా నాంపల్లి లో గల ఉప్పరిగూడ, ముదిరాజ్ కాలనీ తదితర ప్రాంతాలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో TRS శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ప్రజలు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటి రాజగోపాల్ రెడ్డిపై నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు MLA గా గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయి పార్టీ మారిన కారణంగా ఉప ఎన్నికలు వచ్చాయని, దీని వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. TRS అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో MLA గా గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా BJP నేతలు అదే పనిగా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వాని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.