విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు ఆందోళనలు జరుగుతుండగానే మరోవైపు కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల వారు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగాయి కార్మిక సంఘాలు.
స్టీల్ ప్లాంట్ విక్రయానికి ఆన్ లైన్ లో బిడ్లు ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థల్లో 100 శాతం పెట్టుబడులను విక్రయిస్తారు. ఈ నెల 15న ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది. బిడ్లు దాఖలు చేయడానికి ఈనెల 28 చివరి తేదీగా పేర్కొంది. ప్రైవేటీకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు న్యాయ సలహాదారులను, లావాదేవీలు పర్యవేక్షించేందుకు ఆర్ధిక సలహాదారులను కూడా నియమించింది.
సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ తో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు పోరాటంలో కలిసి రావాలని, కేంద్రమా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమా అనేది తేల్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరం రూ. 2 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీ ఈ ఆర్ధిక సంవత్సరంలో 5 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించగలిగింది. అఖిలపక్ష బృందాన్ని, కార్మిక సంఘాల నేతలను ఢిల్లీ కి తీసుకెళ్లాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఎలా రాజకీయంగా నష్టపోయిందో, స్టీల్ ప్లాంట్ పై వెనక్కు తగ్గకపోతే బిజెపి కూడా రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.